అక్కినేని ఏజెంట్ మారుతున్నాడా?

Update: 2022-01-21 12:32 GMT
ఒక సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టి మ‌రో సినిమా మారుతూ వుంటుంది. ఒక హీరో సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధిస్తే అప్ప‌టికే సెట్స్ పై వున్న సినిమాపై దాని ప్ర‌భావం ఖ‌చ్చితంగా వుంటుంద‌న్న‌ది తెలిసిందే. ఆ ప్ర‌భావం కార‌ణంగా మార్పులు చేర్పులు కామ‌న్ గా జ‌రుగుతుంటాయి. ఇక ఆ ప్రాజెక్ట్ ని కెరీర్ మార్పుకు ప్ర‌ధాన అస్త్రంగా భావిస్తే ఆ మార్పులు భారీగానే వుంటాయి. ఇప్ప‌డు ఇదే ప‌రిస్థితిని యంగ్ హీరో అఖిల్ సినిమా ఎదుర్కొంటోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

అక్కినేని అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` సూప‌ర్ హిట్ గా నిలిచి తొలి విజ‌యాన్ని అందించింది. దీంతో త‌రువాత చేయ‌బోయే మూవీ అంత‌కు మించి వుండాలన్న ప్లాన్ అఖిల్ లో మొద‌లైంది. అంతే కాకుండా ఈ మూవీ త‌న కెరీర్ ని మ‌లుపు తిప్పేలా వుండాల‌ని హీరో అఖిల్ తో పాటు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కూడా భావిస్తున్నార‌ట‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి చేస్తున్న మూవీ `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అఖిల్ కెరీర్ లోనే అత్యంత లావిష్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నిఫ‌షియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. అయితే రిలీజ్ త‌రువాతే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో అటెన్ష‌న్ క్రియేట్ చేసిన సురేంద‌ర్ రెడ్డి కోవిడ్ కార‌ణంగా ప్లాన్ మార‌డం.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెర‌గ‌డం వంటి కార‌ణాల‌తో ఈ మూవీ స్క్రిప్ట్ లో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

అంతే కాకుండా మార్పుల‌కు అనుగునంగా కొన్ని సీన్ ల‌ని కూడా మార్చి వాటికి అద‌న‌పు హంగుల్ని జ‌త చేర్చార‌ట‌. స్క్రీన్ ప్లే ప‌న‌రంగానూ మార్పులు చేయ‌డంతో ఇప్ప‌టికే షూట్ చేసిన కొన్ని సీన్ ల‌ని ప‌క్క‌న పెట్టేయాల్సిన ప‌రిస్థితి అని, అయితే వాటిని మ‌రోలా వాడుకోవాల‌ని సురేంద‌ర్ రెడ్డి భావిస్తున్నార‌ట‌. దీనికి మేక‌ర్స్ తో పాటు కింగ్ నాగార్జున కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సురేంద‌ర్ రెడ్డి త‌న వ‌ర్క్ ని మొద‌లుపెట్టేశాడ‌ని చెబుతున్నారు.

స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్ పై సురేంద‌ర్ రెడ్డి కూడా ఓ పార్ట్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయి డైరెక్ట‌ర్ గా కూడా ఆయ‌న పేరు తెచ్చుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌టం లేద‌ని, ప్ర‌తీ విష‌యాన్ని చాలా కేర్ గా చూస్తున్నార‌ని చెబుతున్నారు. ఇది గ‌మ‌నించిన‌ అఖిల్ కూడా సురేంద‌ర్ రెడ్డి ఏది ఓకే అంటే దానికి సై అంటూ ఆయ‌న‌కు స‌హ‌కరిస్తున్నార‌ట‌.
Tags:    

Similar News