హీరోగా అరంగేట్రం చేయడం కంటే ముందే.. సౌత్ ఆడియన్స్ అందరికీ అక్కినేని అఖిల్ బాగా తెలుసు. ఇందుకో ప్రత్యేకమైన కారణం ఉంది. మనోడు మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఆడేవాళ్లను చూసి ఎంజాయ్ చేయడమే కాదు.. తనే స్వయంగా క్రికెట్ సూపర్బ్ గా ఆడేస్తాడు కూడా. అసలే క్రికెట్ అంటే పడిచచ్చే మన జనాలకు.. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లలో అఖిల్ ఆట స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది.
అలాంటి అఖిల్ నుంచి ఓ విషయంపై రియాక్షన్ కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. కేరళ బ్లాస్టర్ ఫుట్ బాల్ క్లబ్ లో దిగ్గజాలందరూ ఒకచోటకు చేరడంతో.. అఖిల్ స్పందన ఎలా ఉంటుందా అనే ఆతృత నెలకొంది. "ఆఫ్ ఫీల్డ్ లో డ్రీమ్ టీమ్ అంతా కలిసి.. ఫీల్డ్ లో డ్రీమ్ టీమ్ ఏర్పాటు చేసేందుకు ఒక చోటకు చేరారు.. వావ్" అంటూ ట్వీట్ చేశాడు అక్కినేని వారసుడు. సింపుల్ ఒకే మాటలో అఖిల్ చెప్పిన మాట అదుర్స్ అంతే. చిరంజీవి - నాగార్జున - అల్లు అరవింద్ - నిమ్మగడ్డ ప్రసాద్.. వీరంతా కలిసి ఇప్పటికే ఓ డ్రీమ్ టీమ్ గా ప్రూవ్ చేసేసుకున్నారు. పలు విభాగాల్లో, వ్యాపారాల్లో సక్సెస్ కూడా సాధించేశారు.
ఇప్పుడు వీరందరికీ ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా తోడవడంతో... ఇది ఖచ్చితంగా డ్రీమ్ టీమ్ కు మించినదే. మరి వీరంతా ఫుట్ బాల్ ఫీల్డ్ లో ఏరేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి. అయితే.. నాగ్ కు ఇప్పటికే ధోనీ భాగస్వామ్యంలో ఓ రేసింగ్ టీమ్ లోనూ పార్ట్నర్ షిప్ ఉండడం విశేషం.