టైమింగ్ కాదు.. కంటెంటే మ్యాటర్

Update: 2017-11-30 17:30 GMT
సినిమాల మధ్య పోటీ.. ఈ పోటీ ఉంటే ఏం జరుగుతుంది అన్నదే పాయింట్. గత రెండు మూడు వారాలుగా అయితే లెక్కకు మించిన సినిమాలు వస్తున్నాయి.. వెళ్లిపోతున్నాయి. కాకపోతే ఇవన్నీ డబ్బింగ్ సినిమాలు.. లో బడ్జెట్ మూవీస్ కాబట్టి ఆడియన్స్ తో పాటు సినీ జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే.. క్రిస్మస్ సందర్భంగా మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అఖిల్ నటించిన హలో.. నాని హీరోగా రూపొందిన ఎంసీఏ.. అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం విడుదల కాబోతోన్నాయి. అయితే.. ఇలా మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడం.. అన్ని చిత్రాలకు నష్టం కలిగిస్తుందని.. కలెక్షన్స్ పంచుకోవాల్సి వస్తుందని అంటున్నారు. కొన్ని నెలల క్రితం నితిన్ మూవీ లై.. రానా నేనే రాజు నేనే మంత్రి.. బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక చిత్రాలు ఒకే సారి వచ్చాయి. ఈ సినిమాలకు టాక్ బాగానే ఉన్నా.. భారీగా నష్టపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

కానీ ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. శర్వానంద్ మూవీ శతమానం భవతి విడుదల అయ్యాయి. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి మర్చిపోకూడదు. క్రాస్ ప్రమోషన్ కూడా ఈ చిత్రాల వసూళ్లకు కారణంగా ట్రేడ్ జనాలు చెప్పుకొచ్చారు. అంటే.. ఓ మూవీ సక్సెస్ వెనుక కేవలం ఆయా చిత్రాల రిలీజ్ టైమింగ్ మాత్రమే కాకుండా.. వాటిలోని కంటెంట్ కే ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయం తేటతెల్లమవుతోంది. ఇప్పుడు హలో.. ఎంసీఏ.. ఒక్క క్షణం చిత్రాల విషయంలో కూడా కంటెంట్ అన్నదే అత్యంత ప్రధానమైన విషయం.
Tags:    

Similar News