కేన్సర్ తో బాధపడుతూనే ఏఎన్నార్ డబ్బింగ్ చెప్పారు: అమల

Update: 2022-07-17 23:30 GMT
అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక చరిత్ర .. నటనకు సంబంధించి చెప్పుకోవాలంటే ఒక పాఠశాల. ఆయన అనుభవాలను కూడా కలుపుకుని చెప్పుకోవాలంటే ఒక పెద్ద బాలశిక్ష. అక్కినేనితో మాట్లాడిన వాళ్లంతా ఆయన పెద్దగా చదువుకోలేదని తెలిసి ఆశ్చర్యపోయేవారట. ఎవరికైనా సరే తాను దేనికి పనికివస్తాననేది తెలియాలి. దేని కోసం పోరాడుతున్నమో తెలియాలి. అప్పుడు విజయాన్ని సాధించడం తేలిక అని ఆయన చెబుతుండేవారు. అలాంటి ఏఎన్నార్  తన చివరి ఊపిరివరకూ నటించాలనుకున్నారు .. ఆ కోరిక కూడా తీర్చుకున్నారు.

ఏఎన్నార్ కేన్సర్ వ్యాధి బారిన పడ్డారు .. ఆ విషయాన్ని ధైర్యంగా మీడియాకు చెప్పినవారాయన. చనిపోవడానికి కొన్ని రోజుల ముందుగా కూడా ఆయన 'మనం' సినిమాలో నటించారు. శరీరం సహకరించకపోయినా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అంతర్జాతీయ కేన్సర్ అవగాహన 'పరుగు పోస్టర్' ను నిన్న రిలీజ్ చేసిన అక్కినేని అమల, ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించారు. గ్రేస్ ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన కేన్సర్ అవగాహనకు సంబంధించిన కార్యక్రమంలో అమల మాట్లాడారు.

"మా మామగారు కేన్సర్ తో బాధపడ్డారు ..  హాస్పిటల్ బెడ్ పై నుంచే తన పాత్రకి డబ్బింగ్ చెప్పారు. అభిమానులందరి ఆశీస్సులతో  తాను అద్భుతమైన జీవితాన్ని గడిపాననీ ..  విచారించవలసిన అవసరం లేదని మాకు ధైర్యం చెప్పేవారు. కేన్సర్ అనేది ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. అలాంటి కేన్సర్ పై అవగాహన అవసరం. మనపై మనం తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం .. ప్రకృతిని ప్రేమించకపోవడం .. పర్యావరణాన్ని పట్టించుకోకపోవడమే కేన్సర్ విజృంభించడానికి కారణం.

పంటలపై కొన్ని రకాల పురుగు మందులు వాడకూడదని తెలిసినా వాడుతున్నారు. అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని తెలిసినా తీసుకుంటున్నారు. ఇలాంటి ఒక నిర్లక్ష్యమే కేన్సర్  రోగులు పెరగడానికి కారణమవుతోంది. అందువలన అందరూ అవగాహన పెంచుకోవలసిన విషయం ఇది .. అందుకు సంబంధించిన జాగ్రత్తలను పాటించ వలసిన సమయం ఇది" అంటూ అమల చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్  వ్యవస్థాపకులు .. సీఈఓ డాక్టర్ చినబాబు .. మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా .. ట్రస్టీ ప్రమీలారాణి .. డైరెక్టర్ నిరంజన్ పాల్గొన్నారు.
Tags:    

Similar News