విడాకులపై స్పందించిన అక్కినేని హీరో!

Update: 2022-02-09 10:30 GMT
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ కి హీరోగా సక్సెస్ గ్రాఫ్ పెద్దగా లేనప్పటికీ, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడనే ఒక మంచి పేరు ఉంది. తనకి సంబంధం లేని విషయాలను గురించి ఆయన ఎంతమాత్రం పట్టించుకోరు. తనకి నచ్చిన సినిమాలు చేస్తారు .. లేదంటే లేదు. సినిమాల గురించైనా .. బయట విషయాల గురించైనా ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేయరు. ఇక ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా తక్కువ. అయితే ఆయన తాజా చిత్రమైన 'మళ్లీ మొదలైంది' జీ 5లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. నైనా గంగూలి .. వర్షిణి సౌందరరాజన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో సుహాసిని .. పోసాని .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. ఈ కథ విడాకుల నేపథ్యంలో నడుస్తుంది. నిజ జీవితంలో సుమంత్ .. కీర్తి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీలో సమంత - చైతూ కూడా ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సుమంత్ విడాకుల విషయాన్ని గురించి మాట్లాడక తప్పలేదు.

"చాలామంది ఫస్టు మ్యారేజ్ విషయంలో మనస్పర్థలు వచ్చినప్పుడు రాజీ పడకుండా విడాకులు తీసుకుంటూ ఉంటారు. రెండవ పెళ్లి చేసుకున్న తరువాత సమస్యలు తలెత్తితే మాత్రం అక్కడ సర్దుకుపోతుంటారు. మళ్లీ పెళ్లి ఆలోచన చేస్తే బాగుండదని భావించి ఆ బంధంలోనే ఉండిపోవడానికి అలవాటుపడిపోతారు. నా స్నేహితులలో అలా చాలామందిని చూశాను. ఇక మా ఫ్యామిలీలోను విడాకులున్నాయని మీకు తెలిసిందే. దురదృష్టవశాత్తు విడాకులు తీసుకోవడమనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. కారణాలు ఏవైనా అలా కొన్ని జరిగిపోతుంటాయి అంతే.

రెండో పెళ్లి కూడా తెగే సమయం వచ్చినప్పుడు .. తమపై ఓ ముద్రపడిపోతుందని ఆలోచన చేస్తారు. ఎలాగైనా ఆ బంధాన్ని అతికించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మా సినిమా విడాకుల చుట్టూనే తిరుగుతుంది. అయితే ఆ పాయింట్ ను ఎలా చెప్పాము? ఎక్కడ ఎలా ముగించాము? అనేది సస్పెన్స్. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీదికి రావడం నాకేమీ అసంతృప్తిని కలిగించడం లేదు. ఎందుకంటే ఈ రోజున ఓటీటీ అనేది అంతటినీ ఆక్రమించేసింది. నేనే చాలా సినిమాలను ఓటీటీలో చూస్తున్నాను .. అలాగే చాలామంది ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' వంటి కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ స్థాయి సినిమాలకి థియేటర్ల వైపు నుంచి ఆ స్థాయి వసూళ్లు రావలసి ఉంటుంది. అందువలన మిగతా సినిమాలు ఓటీటీలో రావచ్చు .. అది ఏ రకంగానూ ఆ సినిమాను తక్కువ చేసినట్టు కానేకాదు.

ఇక నేను ఎప్పుడూ కూడా నా గత చిత్రాలను గురించి అంతగా ఆలోచించను. తరువాత ఏంటి? అన్నట్టుగానే ముందుకు వెళుతుంటాను. నా సినిమా పోతే కొంచెం బాధపడతాను .. బాగా ఆడితే కొంచెం సంతోషపడతాను. రిజల్ట్ ఏదైనా ఎక్కువ ఎమోషన్స్ కి లోనుకావడమనేది ఉండదు. బ్యాలెన్స్డ్ గా ఉండటం నాకు అలవాటు .. బహుశా అది మా తాతగారి నుంచి వచ్చిందేమో" అని చెప్పుకొచ్చారు.  
Tags:    

Similar News