ఎరోటిక్ సినిమాలు బాలీవుడ్ కు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఈ జోనర్ లో హిందీ సినిమాలు కాస్తంత తక్కువే వస్తున్నాయి గానీ ఒకానొక దశలో ఇవి బాలీవుడ్ ను ఊపేశాయి. అధర చుంబనాల నుంచి అందాల ప్రదర్శన వరకు తెరపై అప్పటివరకు హద్దులన్నింటినీ చెరిపేసిన సుందరీమణులు థియేటర్లను తగె హీటెక్కించారు. అప్పట్లో వచ్చిన మర్డర్ - జిస్మ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయేలా చేశాయి. తర్వాత కాలంలో ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. కంటెంట్ లో కొత్తదనం తగ్గిపోవడంతో క్రమేపే ఫేమ్ కోల్పోయాయి.
ఈ మధ్యకాలంలో ఎరోటిక్ సినిమాల్లో కాస్తోకూస్తో ఆదరణ పొందుతూ వచ్చింది హేట్ స్టోరీ సిరీస్ మాత్రమే. ఇన్నేళ్ల తర్వాత ఎరోటిక్ జోనర్ పై మళ్లీ అందరి దృష్టి పడింది. అందుకు కారణం ఒకేసారి రెండు శృంగారభరిత చిత్రాలు వస్తుండటం.. అవీ అప్పటి బ్లాక్ బస్టర్ హిట్లకు సీక్వెళ్లు కావడం. అక్సర్-2 అండ్ జూలీ -2 సినిమాలు రెండూ అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లకు రానున్నాయి. ఈ రెండింటికీ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదే ఈ రెండింటిలోనూ హీరోయిన్లుగా నటించిన వారికి ఫస్ట్ పార్టులతో ఎలాంటి సంబంధం లేకపోవడం. కాకపోతే అక్సర్ తీసిన అనంత్ మహదేవన్... జూలీ తీసిన దీపక్ శివదాసానిలే సీక్వెల్ సినిమాలనూ డైరెక్ట్ చేస్తున్నారు. అక్సర్-2లో జరీన్ ఖాన్ హీరోయిన్ కాగా.. జూలీ-2లో హీరోయిన్ గా చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం. 150 అమ్మడు లెట్స్ కుమ్ముడు అంటూ స్టెప్పులేసిన రాయ్ లక్ష్మి నటిస్తోంది.
ఈ రెండు సినిమాల్లో హీరోయిన్లు అందాల ప్రదర్శనలో ఏ మాత్రం మొహమాటపడే టైపు కాదు. దీనికితోడు ఇప్పుడు శృంగారాన్ని రంగరించి తీస్తున్న చిత్రాలివి. ఇద్దరిలో ఎవరూ ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదన్నది ప్రమోషన్ల కోసం రిలీజ్ చేస్తున్న పోస్టర్లు చూస్తుంటేనే తెలిసిపోతోంది. ఈ మూవీస్ అనుకున్న స్థాయిలో హిట్టయితే ఎరోటిక్ సినిమా మళ్లీ కొత్త కళ సంతరించుకున్నట్టే...