2018 మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ (రోబో2) రిలీజ్ ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ - కిలాడీ అక్షయ్ కుమార్ అభిమానుల్లో ఒకటే ఉత్సాహం నెలకొంది. ఓవైపు నిర్మాణానంతర పనుల్లో ఎంతవరకూ పూర్తయ్యాయి? అన్నదానిపై శంకర్ బృందం ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. రిలీజ్ తేదీని అయితే ప్రకటించారు కానీ - వీఎఫ్ ఎక్స్ - గ్రాఫిక్స్ వర్క్ ఇంత శాతం పూర్తయిందన్న మాట మాత్రం వినిపించలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో నవంబర్‌లో రిలీజ్ చేయాలన్న తపన మాత్రం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. 2.ఓ టీజర్ ని రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
2018 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 2.ఓ టీజర్ ని రిలీజ్ చేసేందుకు శంకర్ బృందం సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అదే రోజు కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `గోల్డ్` రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అంటే హిందీ ఆడియెన్ కోసం `గోల్డ్` సినిమాతో పాటుగా 2.ఓ టీజర్ ని థియేటర్లలో ప్రదర్శిస్తారని భావించవచ్చు. ఇకపోతే 2017 దీపావళి రిలీజ్ అన్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత 2018 రిపబ్లిక్ డే కానుకగా జనవరిలో రిలీజవుతుందని చెప్పారు. అప్పుడూ వాయిదానే. ఆ తర్వాత ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించి విఫలమయ్యారు. కనీసం ఈసారైనా నవంబర్ 29న రిలీజ్ కావాలనే అభిమానులు భావిస్తున్నారు. ఇటు సూపర్‌స్టార్ రజనీకాంత్ - శంకర్ ఫ్యాన్స్, అటు కిలాడీ అక్షయ్ - ఎమీజాక్సన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. మరి శంకర్ & టీమ్ ఏం చేస్తారో చూడాలి.