ఈ తెలుగు భాష ఏదైతే ఉందో... పాపం అలియాభట్

Update: 2020-12-25 10:26 GMT
‘దేశభాషలందు తెలుగు లెస్స..’ అయితే.. ఇది మనకు మాత్రమే. ఇతరులకు మాత్రం మన భాష నిజంగా పెద్ద బాల‘శిక్షే’! ఇక సినిమా హీరోయిన్లు పడే అవస్థలైతే అన్నీ ఇన్నీ కావు. ముంబైలో టేకాఫ్ అయ్యి.. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ఫ్లైట్ లోంచి దిగే బాలీవుడ్ భామలు.. తెలుగు పదాలు అర్థంకాక, నోరు తిరగక నానా తంటాలు పడుతుంటారు పాపం. అందుకే.. చాలా మంది హీరోయిన్లకు కెమెరా ముందు వన్.. టూ.. త్రీ.. అంటూ నెంబర్లు నేర్పిస్తుంటారు డైరెక్టర్లు. వాటిని ఆ భామలు బట్టీపట్టి అప్పజెప్పితే.. డైలాగులను డబ్బింగ్ తో కవర్ చేస్తుంటారు చాలా మంది దర్శకులు.

అలియా అవస్థలు..
ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ వంతు వచ్చింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ భామ తెలుగు సజావుగా మాట్లాడేందుకు తంటాలు పడుతోందట. అసలే.. జక్కన్న ఎక్కడా వంక లేకుండా తన సినిమాను చెక్కుతుంటాడు. మరి, అత్యంత ప్రధానమైన డైలాగ్ డెలివరీని ఎలా లైట్ తీసుకుంటాడు? అందుకే.. అలియాను ఈ విషయంలో టైట్ చేశాడట. బాడీ లాంగ్వేజ్ తో సమానంగా డైలాగ్ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేశాడట దర్శకధీరుడు. ఇంకేముంది.. నిద్రలో కూడా తెలుగు పదాలు అలియా పెదాలను వదలట్లేదట!

ఏడాదిన్నర కాలంగా..
టిఫెన్ చేస్తున్నప్పుడు.. మధ్యాహ్న లంచ్, రాత్రి డిన్నర్ టైంలో కూడా తన డైలాగులను నేర్చుకుంటోందట ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది ఈ భామ. హిందీ, తెలుగు రెండు భాషల్లోనూ ఒకేసారి షూటింగ్ చేయడం ఇదే మొదటిసారని, ఇది చాలా భిన్నమైన అనుభవం అని చెప్పింది. మొత్తంగా.. గత ఏడాదిన్నర కాలంగా తెలుగు ప్రాక్టీస్ చేస్తోందట అలియా భట్.

రిజల్ట్ ఎలా ఉంటుందో?
మొత్తానికి.. తెలుగు భాష నేర్చుకోవడానికి ఒక అకడమిక్ ఇయర్ కన్నా ఎక్కువ టైమే తీసుకుంది అలియా. మరి, తెలుగు క్లాసులు ఎలా విన్నది? ఏ మేరకు హోం వర్క్ చేసింది? ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాసింది? అనేది తెలియాలంటే.. మూవీ రిలీజ్ కావాల్సిందే. అప్పుడే.. ఈ బొంబాయి బొమ్మ.. బాపు బొమ్మలా అచ్చతెలుగు స్వరం వినిపించిందా? వన్ టూ త్రీ బ్యాచ్ మాదిరిగానే ఇబ్బంది పడిందా? అన్నది తేలుతుంది. ప్రస్తుతానికి మనమైతే.. మన భాష నేర్చుకుంటున్న ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుదాం మన పద్ధతిలో.

కాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్‌గన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది దసరా నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు జక్కన్న. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ మూవీని.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో దానయ్య నిర్మిస్తున్నారు.




Tags:    

Similar News