బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు ఆ రెండు సినిమాలపైనే..!

Update: 2022-06-15 07:41 GMT
హిందీ చిత్ర పరిశ్రమ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చలాయించిన బాలీవుడ్.. ఇప్పుడు సౌత్ సినిమా ధాటికి నిలబడలేకపోతోంది. బిగ్ స్టార్స్ నటించిన చిత్రాలు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2021లో పాండమిక్ తర్వాత వచ్చిన అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ సంచలన విజయం సాధించింది. రూ. 20 కోట్ల లోపు బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 350 కోట్ల గ్రాస్ అందుకుంది.

గతేడాది చివరిలో వచ్చిన రణ్‌ వీర్ సింగ్ '83.. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన అలియా భట్ 'గంగుబాయి' బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఇదే క్రమంలో జాన్ అబ్రహం 'ఎటాక్' - అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' - 'షాహిద్ కపూర్ 'జెర్సీ' - అజయ్ దేవగన్ 'రన్ వే 34' - టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2' - రణ్‌ వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్' - కంగనా 'ధాకడ్' వంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి.

ఇటీవల భారీ అంచనాల నడుమ వచ్చిన అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' మూవీ కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. అదే సమయంలో 'పుష్ప: ది రైజ్' - 'ఆర్.ఆర్.ఆర్' - 'కేజీఎఫ్: చాప్టర్-2' 'మేజర్' 'విక్రమ్' వంటి సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్ లో భారీ వసూళ్లు సాధించి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

అయితే కార్తీక్ ఆర్యన్ 'భూల్ భులయ్యా 2' సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటి వరకు రూ. 172 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ కు ఊపిరిపోసింది. అంటే ఈ ఏడాది 'ది కశ్మీర్ ఫైల్స్' మరియు 'భూల్ భులయ్యా 2' వంటి రెండు హిందీ సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. ఇవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ.. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తున్న సౌత్ సినిమాలతో పోల్చదగినవి కాదు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు సినిమాలపైనే ఇప్పుడు బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది.

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ''లాల్ సింగ్ చద్దా''. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామాలో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2022 ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇది కచ్చితంగా హిందీ చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తుందని బాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు.

'దంగల్' 'సీక్రెట్ సూపర్ స్టార్' 'పీకే' వంటి సినిమాలను అందించిన అమీర్ ఖాన్.. ఇప్పుడు ''లాల్ సింగ్ చద్దా'' తో ఈ రేంజ్ సక్సెస్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమీర్‌ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌ - వయ్ కామ్18 స్టూడీయోస్ బ్యాన‌ర్‌ ల‌పై ఆమిర్‌ ఖాన్‌ - కిర‌ణ్‌రావు - జ్యోతి దేశ్‌ పాండే - అజిత్ అందారే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇకపోతే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ని తెలుగులో ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం-శివ'' పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

'బ్రహ్మాస్త్ర' సినిమా ఘనవిజయం సాధిస్తుందని.. మళ్లీ అందరూ బాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేస్తుందని భావిస్తున్నారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. నాలుగు దక్షిణాది భాషల్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది.

'లాల్ సింగ్ చద్దా' మరియు 'బ్రహ్మాస్త్ర' సినిమాలు బాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని భావిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాలలో అక్కినేని తండ్రీకొడుకులు భాగం అయ్యారు. ఒకటి నాగచైతన్యకు హిందీ డెబ్యూ అయితే.. మరొకటి నాగార్జున చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం విశేషం. నెల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News