రెడ్ స్టార్ వెంట ఎర్ర‌సైన్యం వీళ్లు!

Update: 2019-06-04 05:51 GMT
విలువ‌ల‌కు సిద్ధాంతానికి క‌ట్టుబ‌డ‌డం ఎలానో ఆర్.నారాయ‌ణ‌మూర్తిని చూసి నేర్చుకోవాలి. ఎన్టీఆర్- ఏఎన్నార్ కాలం నుంచే ఆయ‌న ఆర్టిస్టుగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. ఎనిమిది ద‌శాబ్ధాల టాలీవుడ్ లో 5 ద‌శాబ్ధాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ఇన్నేళ్ల పాటు క‌మ‌ర్షియాలిటీ కోసం సినిమా తీయ‌ని.. కేవ‌లం తాను న‌మ్మే బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాలు.. నిజ‌మైన ప్ర‌జ‌ల కోసం సినిమాలు తీసే ఏకైక ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఆయ‌న ఒక్క‌రే నిల‌బ‌డ్డారు. ఆయ‌న సినిమా ప్రారంభిస్తే సెట్ లో ఓ రైత‌న్న‌లా ప‌ని చేస్తారు. త‌న‌తో పాటు ఉన్న‌వారి చేత అలానే పనులు చేయిస్తారు. ఎక్క‌డ ప‌ని చేస్తే అక్క‌డే వండుకుని తిని ప‌డుకోవాలి! అన్న‌ది ఆయ‌న సిద్ధాంత‌మ‌ని చెబుతారు. సింప్లిసిటీకి అత‌డు మారుపేరు. క‌మ్మ్యూనిజం భావాల్ని అణువ‌ణువునా పుణికి పుచ్చుకుని వాటిని ఆచ‌రించే ద‌ర్శ‌కనిర్మాత‌.. న‌టుడు ఆయ‌న మాత్ర‌మే. దేవుడా నా సినిమా హిట్ట‌వ్వాలి! అని పొద్దున్నే దేవుళ్ల‌కు మొక్కుకునే సెంటిమెంటు ప్ర‌పంచంలో ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ప్ర‌సాద్ ల్యాబ్స్ లో మీడియా మీట్ అంటే టెన్ష‌న్ గా చెప్పిన టైముకే ఆటో రిక్షాలో అక్క‌డ దిగిపోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. కోట్లు ఇస్తాం మా సినిమాలో న‌టిస్తావా? అన్నా ఆయ‌న లెక్క చేయ‌రు. వైయ‌స్సార్- వైయ‌స్ జ‌గ‌న్ అంత‌టివారే ఎమ్మెల్యే సీటిస్తాం పోటీ చేస్తారా? అంటూ సున్నితంగా తిర‌స్క‌రించిన మూర్తిమ‌త్వం అత‌డు.

అందుకే ఆయ‌నంటే ఎంద‌రికో అభిమానం. తెలుగు సినీమీడియా ఆయ‌న్ని గొప్ప‌గా గౌర‌విస్తుంది. అంతేనా.. ప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జాలెంద‌రో ఆయ‌న్ని గౌర‌వించి అభిమానిస్తారు. పూరి జగన్నాథ్‌- వి.వి.వినాయక్‌- పరుచూరి గోపాలకృష్ణ- శేఖర్‌ కమ్ముల- బి.గోపాల్‌- కాశీ విశ్వనాథ్‌- అనిల్‌ రావిపూడి వీళ్లంతా ఎర్ర సైన్యంలా ఆయ‌న వెంట నిలుస్తారు. ఆ సంగ‌తి నిన్న‌టిరోజున `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ప్రివ్యూ వేళ అర్థ‌మైంది. ఈ ప్రివ్యూకి వీళ్లంతా త‌మ విలువైన స‌మ‌యం కేటాయించి రావ‌డ‌మే కాదు.. మూవీపైనా.. నారాయ‌ణ‌మూర్తిపైనా ప్ర‌శంస‌లు కురిపించారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ``చిన్నప్పటి నుంచీ మూర్తిగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇన్నేళ్లయినా ఆయన తన పంథాని మార్చుకోకపోవడం గొప్ప విషయం`` అన్నారు. డబ్బు కోసం ఏనాడూ సినిమా తీయని వ్యక్తి నారాయణమూర్తి. ప్రజా సమస్యలే ఆయన కథలయ్యాయని  వినాయక్ ప్ర‌శంసించారు. ఇన్నేళ్లుగా సందేశాత్మక చిత్రాలు చేయడం గొప్ప విషయం అని శేఖర్‌ కమ్ముల అభినందించారు. రాజ్యాధికారం కోసం అంబేడ్కర్‌, జ్యోతిబాపూలే వేసిన బాటలో దేశం పయనించాలి. ప్రజాస్వామ్యం అంగట్లో సరుకు కాదు. ఓటుని అమ్ముకోకూడదు అన్న‌దే త‌మ సినిమా సిద్ధాంత‌మ‌ని ఆర్.నారాయ‌ణ‌మూర్తి అన్నారు. గద్దర్‌, ధవళ సత్యం, ఎల్‌బీ శ్రీరాం వంటి దిగ్గజాలు మూర్తిని ఈ కార్య‌క్ర‌మంలో అభినందించారు. 

   
   
   

Tags:    

Similar News