దేశంలో థియేట‌ర్ల‌న్నీ రీఓపెన్.. కానీ ఏపీలోనే ఎందుక‌లా?

Update: 2021-07-25 15:46 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30 నుంచి థియేట‌ర్లు రీ ఓపెన్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి ప్ర‌భుత్వం 100 శాతం అక్యుపెన్సీ తో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనుమ‌తులిచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లో పార్కింగ్ ఫీజుల వ‌సూళ్ల‌కు అనుమ‌తులిచ్చింది. అయితే తాజాగా మ‌హారాష్ట్ర‌.. ఢిల్లీ రాష్ట్రాల్లో థియేట‌ర్లు అన్ లాక్ చేయ‌డానికి అక్క‌డి ప్ర‌భుత్వాలు అనుమ‌తులిచ్చాయి. దీంతో ఎగ్జిబిట‌ర్లు సంబరాలు చేసుకుంటున్నారు. చిత్ర నిర్మాత‌లు,.. డిస్ట్రిబ్యూట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేసారు. శ‌నివారం సాయంత్ర ఢిల్లీ ప్ర‌భుత్వం అనుమ‌తిలిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

దేశంలో తొలిసారి లాక్ డౌన్ ప‌డిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ సినీరంగం తీవ్రంగా దెబ్బ‌తింద‌ని..సినిమాల రిలీజ్ లు లేక నిర్మాత ద‌గ్గ‌ర నుంచి బ‌య్య‌ర్ వ‌ర‌కూ అంద‌రూ ఇబ్బందులు ప‌డ్డార‌ని ప‌లువురు పంప‌ణీ దారులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు మంచి నిర్ణ‌యాలు తీసుకున్నాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ మ‌హారాష్ట్ర‌లో ఆగ‌స్టు తొలి వారం నుంచి థియేట‌ర్లు అన్ లాక్ కానున్నాయి. క‌ర్నాట‌క‌లో ఇప్ప‌టికే 50శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతున్నాయి.

చాలా రాష్ట్రాల్లో నెమ్మ‌దిగా థియేట‌ర్ల‌ను తెరుస్తున్నారు. ఏపీలో 50 శాతం అక్యుపెన్సీతో తెరుచుకోవ‌డానికి ఇక్క‌డి ప్ర‌భుత్వం కూడా కొద్ది రోజుల క్రిత‌మే అనుమ‌తులిచ్చింది. కేవ‌లం రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ కర్ఫ్యూ త‌ప్ప మిగ‌తా స‌మ‌యంలో అన్ని రకాల సేవ‌ల‌కు పూర్తి స్థాయిలో వెసులుబాటు క‌ల్పించింది. కానీ ఏపీలో థియేట‌ర్లు తెర‌వ‌డానికి ఎగ్జిబిట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. అలాగే ఇక్క‌డి నిర్మాత‌లు థియేట‌ర్లో సినిమాలు రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేదు. ఇలా ప‌లు కార‌ణాల‌తో ఏపీలో థియేట‌ర్లు రీ ఓపెనింగ్ పై స్ప‌ష్ట‌త లోపించింది. ప‌రిస్థితులు చూస్తుంటే ఇక్క‌డి ప్ర‌భుత్వం కూడా సినీరంగం విష‌యంలో మిన‌హాయింపులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ పెర‌గ‌నుంది. సినిమా టిక్కెట్ ధ‌ర‌ను పెంచేలా ప్రభుత్వం వెసులుబాటు క‌ల్పించాల‌ని ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తోన్న తెలిసిందే. క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకుని పంతాలు ప‌ట్టింపుల‌కు పోకుండా ఏపీ ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించాల‌ని ప‌లువురు కోరుతున్నారు. మునుముందు ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.


Tags:    

Similar News