బాలయ్యతో అల్లు అరవింద్.. మరో బిగ్ ప్లాన్! 

Update: 2023-01-16 14:30 GMT
ముందు నుంచి మెగా క్యాంపు వర్సెస్ నందమూరి క్యాంప్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉండేవి. మెగాస్టార్ సినిమాకి పోటీగా బాలకృష్ణ సినిమా బాలకృష్ణ సినిమాకి పోటీగా మెగాస్టార్ సినిమా అన్నట్లుగా ఎప్పటికప్పుడు పోటీ వాతావరణం నెలకొని ఉండేది. అయితే మెగాస్టార్ చిరంజీవికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన అల్లు అరవింద్ మెగాస్టార్ కు దూరమయ్యారు.

చిరు రీ ఎంట్రీ సినిమా కోసం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించిన క్రమంలో అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య దూరం మొదలయింది. అప్పటినుంచి ఈ కుటుంబాల మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే గీతా ఆర్ట్స్ లో మెగాస్టార్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క సినిమా కూడా చేయకపోవడం, అల్లు అర్జున్ కూడా మెగా అనే పదానికి దూరమవుతూ తనను తాను ఐకాన్ స్టార్ గా సృష్టించుకునే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది.

అలాగే ఆహా వీడియో అనే తన సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం సొంత బావ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బాలకృష్ణను అల్లు అరవింద్ అప్రోచ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది కొత్త ఈక్వేషన్లకు తెర తీయడంతో ఈ విషయం మీద కూడా అనేక చర్చలు జరిగాయి. తాజాగా ఇదే విషయం మీద చిరంజీవి స్పందించారు కూడా. తమకు అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేవని అందరం కలిసే ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అల్లు అరవింద్ బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ తో బింబిసార అనే సినిమా చేసి సూపర్ హిట్ అందించిన వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణతో గీత సంస్థ ఒక సినిమా ప్లాన్ చేసిందని అంటున్నారు. వాస్తవానికి గీత సంస్థ ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు, ఒక బడా ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న చిన్నాచితకా ప్రాజెక్టులన్నీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీదే చేస్తున్నారు. కొంత గ్యాప్ రావడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలని భావిస్తున్న అల్లు అరవింద్ అది బాలకృష్ణ తోనే సెట్ చేసుకున్నారని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేసేందుకు అల్లు అరవింద్ రంగం సిద్ధం చేశారు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News