అరవింద్ గారూ .. నాతో ఓ హిందీ సినిమా తీయండి

Update: 2021-12-17 04:36 GMT
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందించాడు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మైతీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఆయా భాషలకి చెందిన ప్రాంతాల్లో జరిగిన ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. కన్నడ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయనకి కాస్త అసహనాన్ని కలిగించే ప్రశ్నలు ఎదురైనప్పటికీ, తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పాడు.

ఆ తరువాత ముంబై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన జోరు చూపించాడు. అల్లు అర్జున్ కి ఇది ఫస్టు పాన్ ఇండియా సినిమా. అందువలన ఆయన మొదటిసారి నేషనల్ మీడియాతో మాట్లాడాడు. అలాంటి అవకాశం వచ్చినందుకు తనదైన స్టైల్లో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. "ఇంతవరకూ తెలుగులో తప్ప ఇతర భాషల్లో నటించలేదు.

అయినా నేను చేసిన సినిమాలు హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేరుగా హిందీలోను చేయాలని ఉంది. "అరవింద్ గారూ .. నేరుగా హిందీలో నాతో ఒక సినిమా తీయండి" అంటూ మీడియా ముఖంగా తన తండ్రిని రిక్వెస్ట్ చేయడం ఆకట్టుకుంది.

'పుష్ప' సినిమాను దాదాపు అడవి ప్రాంతంలోనే షూటింగు చేస్తూ వెళ్లాము. ప్రతి రోజు 500 మందికి పైగా ఈ సినిమా కోసం పనిచేసేవాళ్లం. ఎలాంటి వసతి సౌకర్యాలు లేని ఒక అడవి ప్రాంతంలో .. అందునా డీప్ ఫారెస్టులో షూటింగు చేయడం అంత ఆశా మాషీ విషయం కాదు. కరోనా సమయంలో ఇంతమంది విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం అంత తేలికైన విషయం కాదు.

వర్షాల రూపంలో ఎదురైన అవాంతరాలను ఎదుర్కొన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా దర్శక నిర్మాతలకు చెందుతుంది. కథ చాలా పెద్దది కావడం వలన .. విస్తృతంగా చెప్పే అవకాశం ఉండటం వలన, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాము.

ఇప్పుడు సినిమాకి భాష అనే హద్దులు చెరిగిపోయాయి. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా, మరో భాషలో విడుదలవుతూనే ఉంది. తమ భాష చిత్రంలానే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు కూడా. సౌత్ .. నార్త్ అనే విషయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు మనది ఇండియన్ సినిమాగా ఎదిగిపోయింది. విదేశాల్లోను మంచి మార్కెట్ ను సంపాదించుకుంటోంది.

మొదటి నుంచి కూడా నాకు అమితాబ్ స్ఫూర్తి. ఇక సౌత్ లో పుట్టి పెరగడం వలన నాపై చిరంజీవి - రజనీకాంత్ ల ప్రభావం కూడా సహజంగానే ఉంటుంది. వారి మేనరిజమ్స్ నాలో ఉన్నాయని అంటూ ఉంటారు. ఇక్కడ ఈ స్థాయి ఆదరణ చూపించిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News