విజయ్ ఎదుగుతుంటే నాకెందుకు జెలస్ ఉంటుంది: అల్లు అర్జున్

Update: 2021-10-31 04:32 GMT
ఈ మధ్య అల్లు అర్జున్ .. ఒక వైపున షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున  ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చీఫ్ గెస్టుగా మెరుస్తున్నాడు. ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన 'బ్యాచ్ లర్' .. 'వరుడు కావలెను' రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన నిన్న రాత్రి జరిగిన 'పుష్పక విమానం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడాడు.

"ఈ సినిమా ట్రైలర్ ను నేను లాంచ్ చేశాను గనుక చెప్పడం లేదు .. నిజంగా ఈ ట్రైలర్ నాకు నచ్చింది. ఈ ట్రైలర్ లాంచ్ కి నన్ను పిలవకపోయినా నేను ట్వీట్ చేసేవాడిని. ట్రైలర్ చాలా చాలా బాగుంది. నా సొంత సినిమా అయినా సరే నాకు నచ్చకపోయితే దాని గురించి ఎక్కువగా మాట్లాడను .. సైలెంట్ గా ఉండిపోతాను. నచ్చితే మాత్రం జనం దగ్గరికి తీసుకెళ్లడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ ట్రైలర్ చూసిన తరువాత నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం లేదు .. అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెబుతున్నాను.

విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే సెల్ఫ్ మేడ్ యాక్టర్. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ .. ఎదుగుతూ రావడం నేను చూశాను. విజయ్ ఎదుగుదలను చూసి ఆనందించేవాళ్లలో నేను ఒకడిని. విజయ్ చాలా నైస్ హార్ట్  పర్సన్ .. వెరీ ఇంటెలిజెంట్. ఏ విషయాన్ని గురించైనా ఆయన చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఆయనలో ఒక రకమైన స్వీట్ నెస్ ఉంటుంది .. అదే నాకు నచ్చుతుంది. విజయ్ చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావొచ్చు .. మరికొన్ని బ్లాక్ బస్టర్ కావొచ్చు. కానీ ఆయన తన ప్రయోగాలను మాత్రం ఎప్పుడు ఆపలేదు.

ఒక నటుడిగానే కాదు .. ఒక బిజినెస్ మెన్ గా కూడా ఆయన ప్రయోగాలు చేస్తున్నాడు. 'రౌడీస్ 'నుంచి ప్యాకెట్ వచ్చిన ప్రతిసారి నేను చాలా ఎగ్జైట్ అవుతా .. బట్టలు వచ్చేసినయేనని. తన కెరియర్ ఆరంభంలో నిర్మాతలు దొరకలేదని తానే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్న విజయ్ తీరు నాకు ఎంతో నచ్చింది. ఈ బ్యానర్ పై వరుస సినిమాలు రావాలనీ, పెద్ద హిట్లు అందుకోవాలని ఆశిస్తున్నాను.

ఒకసారి ఒక వ్యక్తి నన్ను అడిగారు .. 'సార్ విజయ్ లాగా ఒక పర్సన్ పైకి వెళుతుంటే మీకు జెలస్ అనిపించడం లేదా? అని. నాకెందుకు జెలస్ ఉంటుంది. ఎవరి విషయంలోనైనా నేను చెప్పేది ఒకటే .. మన తరువాత వచ్చిన వాళ్లు మనలను దాటేసి వెళ్లిపోతున్నారంటే దాని అర్థం మనం పరిగెత్తడం లేదని. అది వాళ్ల తప్పు అవదు .. మన తప్పు అవుతుంది. ఈ సినిమా హీరోయిన్స్ లో గీత్ సైనీ అనే పేరు విని నార్త్ ఇండియన్ అనుకున్నాను. కానీ తెలుగు అమ్మాయని తెలిసింది. తెలుగు నుంచి ఎక్కువమంది అమ్మాయిలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది" అంటూ అభినందించాడు. ఇక మేఘన విషయానికి వస్తే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటూ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News