అల్లు అర్జున్ కు షాకిచ్చిన పోలీసులు

Update: 2019-07-25 06:57 GMT
నెటిజన్లు యమ ఫాస్ట్ అయిపోయారు. అతడు హీరోనా.. ప్రముఖ దర్శకుడా అన్న సంగతిని పక్కనపెట్టేస్తున్నారు. రోడ్డు మీదకు వచ్చినప్పుడు అందరూ రూల్స్ పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అతిక్రమిస్తే ఎంతటి వారికైనా శిక్ష వేయాల్సిందేనని తమ చర్యలతో తేల్చిచెబుతున్నారు.

మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బైక్ పై త్రిబుల్ రైడింగ్ రాగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. పోలీసులు బైక్  కు ఫైన్ వేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ఎంతో ముచ్చటపడి కొనుక్కొని ప్రాణంగా చూసుకుంటున్న క్యారవాన్ కు పోలీసులు ఫైన్ వేసిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్టార్ హీరో అల్లు అర్జున్ కోట్లు పెట్టి ప్రత్యేకంగా తయారు చేయించుకున్న క్యారవాన్ సౌకర్యాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అత్యంత విలాసవంతమైన క్యారవాన్ తాజాగా ఈ నెల 16న సాయంత్రం 4.25 గంటలకు రోడ్డుమీదకు వచ్చింది. హిమాయత్ సాగర్ ప్రాంతంలో వెళ్తోంది. ట్రాఫిక్ జామ్ కావడంతో అటు గా దాని వెనుక ఉన్న మహ్మద్ అబ్దుల్ అజం దాన్ని గమనించాడు. నిబంధనలకు విరుద్ధంగా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ఉండడాన్ని ఫొటో తీసి సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.

ఇక నెటిజన్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అంతే వేగంగా స్పందించిన పోలీసులు ఆ క్యారవాన్ అల్లు అర్జున్ కు చెందినదిగా తేల్చి నిబంధనలు ఉల్లంఘించినందుకు అల్లు అర్జున్ కు రూ.735 జరిమానా విధించడం సంచలనంగా మారింది. ఇలా అందరూ రూల్స్ పాటించాల్సిందేనని అటు పోలీసులు, ఇటు నెటిజన్లు తాజా ఉందంతంతో మరోసారి నిరూపించినట్టైంది.

   
   
   

Tags:    

Similar News