నామినేషన్ చాలంటున్న అల్లు అర్జున్

Update: 2017-06-20 07:22 GMT
అల్లు అర్జున్ గత కొన్నేళ్లలో హీరోగా రేంజి పెంచుకోవడమే కాదు.. నటుడిగానూ ఎదిగాడు. ఈ మధ్య ఏ అవార్డుల వేడుక జరిగినా బన్నీ ఉత్తమ నటుడి పురస్కారానికి రేసులో ఉంటున్నాడు. నామినేషన్లు సంపాదిస్తున్నాడు. అవార్డులూ అందుకుంటున్నాడు. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రకు గాను బన్నీ చాలా అవార్డులే అందుకున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ‘సరైనోడు’ సినిమాలకు కూడా కొన్ని నామినేషన్లు సంపాదించాడు. తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల్లోనూ ఓ పురస్కారం దక్కింది. ఐతే అవార్డులు వచ్చినా రాకున్నా.. తనకు నామినేషన్లు వస్తే చాలని.. అవే తనకు చాలా సంతోషాన్నిస్తాయని అంటున్నాడు బన్నీ.

అవార్డుల విషయంలో మీ ఫీలింగేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగితే... ‘‘అవార్డుల గురించి పట్టించుకోనని అనను. వాటికి నేను ప్రాధాన్యం ఇస్తా. ఐతే నాకు అవార్డు వచ్చినా రాకపోయినా.. నా నామినేషన్‌ మాత్రం ఉండాలనుకొంటా. ఒక అవార్డు రావడానికి చాలా కారణాలుంటాయి. నామినేషన్‌ అనేది నా పని తీరుని బట్టే ఉంటుంది. అందుకే పురస్కారం కంటే నామినేషన్‌ దగ్గరే సంతృప్తి చెందుతుంటా’’ అని బన్నీ చెప్పాడు. సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది తన మీద పెద్దగా ప్రభావం చూపదని బన్నీ చెప్పాడు. ఎందుకంటే సినిమా ఫలితం తన చేతిలో ఉండదని అతనన్నాడు. ‘‘ఒక సినిమా సక్సెస్ అయిందంటే అందులో క్రెడిట్ ఎక్కువగా దర్శకుడికే వెళ్తుంది. ఒక హిట్టు సినిమాలోనూ అదే నటుడే. ఫ్లాప్‌ సినిమాలోనూ అదే నటుడే. హిట్.. ఫ్లాప్ అనే తేడా చూపించేది మాత్రం దర్శకులే కదా. సినిమా మొదలయ్యే ముందు ‘మీరేం చేస్తారో తెలియదు. మంచి సినిమా కావాలి’ అని మాత్రం దర్శకులకు చెబుతుంటా. తర్వాత నా పని నేను చేసుకుపోతుంటా. నా సినిమా అంటే అన్ని విభాగాల్లోనూ బాగుండాలని కోరుకుంటా’’ అని బన్నీ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News