ఇంతమంది హీరోలు ఉండగా నాతో సినిమా చేయడం గొప్ప విషయం!

Update: 2021-10-20 03:59 GMT
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో అఖిల్ ఒకరు. నటన .. డాన్స్ .. ఫైట్స్ విషయంలో ఆయనకి వంకబెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే ఆశించినంత త్వరగా విజయాలను అందుకోలేకపోయాడు. సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ పెరుగుతూ రావడం .. అలా వచ్చిన సినిమాలు హిట్ కాకపోవడం ఆయనను చాలా నిరాశపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్లో .. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశాడు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేడుకపై అఖిల్ మాట్లాడుతూ .. "ముందుగా ఒక గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడటం మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఆయన ఎవరివో కాదు .. అల్లు అరవింద్ గారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఆయనను చూస్తే నాకు నా గాడ్ ఫాదర్ అనిపిస్తుంది. ఆయనతో పాటు ఆయన సంస్థలోని వాళ్లంతా ఒక తమ్ముడిగా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అందుకు మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నాను.

మీ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండగా ఈ సినిమాను నాతో చేయడం మీ గొప్పతనం. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' టీమ్ చాలా నిజాయితీగా పనిచేసింది. ఒక మంచి కథను తీశామనే నమ్మకంతో దసరా పండక్కి మీ ముందుకు వచ్చాము. ఈ కథ ద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నం కూడా చేశాము. అవి వర్కౌట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాతో హిట్టు కొట్టేశాం అని కాకుండా, ఈ ఊపును .. ఎనర్జీని తీసుకుని క్రమశిక్షణతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఈ హిట్టును మీరు ఇచ్చిన గిఫ్టుగా భావిస్తున్నాను.

థియేటర్లకు ధైర్యంగా వస్తూ .. కొత్త సినిమాలకు .. ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. మా టీమ్ లో ముగ్గురు వ్యక్తుల గురించి ముఖ్యంగా చెప్పాలి. బన్నీవాసు .. వాసు వర్మ .. బొమ్మరిల్లు భాస్కర్ గురించి చెప్పాలి. ఈ సినిమాకు వాళ్లంతా పిల్లర్స్ గా నిలబడ్డారు. రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం పనిచేశారు. మేమంతా కూడా అల్లు అరవింద్ గారు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టామనే అనుకుంటున్నాము. ఇక పూజ గురించి చెప్పాలంటే తను ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. 'విభా అనే పాత్రకు లైఫ్ తీసుకొచ్చింది.

ఇక బన్నీ బ్రదర్ గురించి నేను ఫార్మల్ గా మాట్లాడలేను. ఇక్కడికి వచ్చిన ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను. బన్నీ ఏ సినిమా చేస్తున్నా ఆ పాత్రను ఓన్ చేసుకుని ఆ పాత్రలోనే కనిపిస్తూ ఉంటాడు. నిజంగా ఆయనలోని గొప్పతనం అదే. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన నా బ్రదర్ బన్నీకి మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను. లాస్ట్ ఫంక్షన్ అప్పుడు అక్కినేని అభిమానుకులకు ఒక మాట చెప్పాను. నాపై మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని. సక్సెస్ వచ్చింది సంతోషం .. కానీ నాకు నిద్ర ఇంకా రావడం లేదు. ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.


Tags:    

Similar News