అల్లు రామలింగయ్య జయంతి నేడు .. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన మనవళ్లు!

Update: 2021-10-01 07:30 GMT
తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన నటులలో అల్లు రామలింగయ్య ఒకరు. తెలుగు తెరపై హాస్యనటుడిగా ఆయన వేసిన ముద్రను .. చేసిన సంతకాన్ని ఎవరూ చెరపలేరు. ఆయన సాధించిన విజయాల వెనుక ఎంతో కృషి .. మరెంతో పట్టుదల కనిపిస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా 'పాలకొల్లు'లో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా అల్లు చాలా చురుకుగా .. చలాకీగా ఉండేవారట. ఎవరి మాట .. నవ్వు .. నడక ప్రత్యేకంగా అనిపించినా వాళ్లను అనుకరిస్తూ ఉండేవారు. అలా ఆయన ఆ ఊళ్లో ఒక ఆకతాయిగా అల్లరి పనులు ఎక్కువగా చేసేవారు.  

అలాంటి పరిస్థితుల్లోనే ఆయన దృష్టి నాటకాల వైపుకు వెళ్లింది. అప్పటి నుంచి ఆయన నాటక ప్రదర్శనలు ఇస్తూ ముందుకు వెళ్లారు . నాటకాలలో మంచి పేరు వస్తుండటంతో సహజంగానే ఆయన మనసు సినిమాల వైపుకు మళ్లింది. ఆ సమయంలోనే దర్శక నిర్మాత గరికపాటి రాజారావు కంట్లో అల్లు పడ్డారు .. ఫలితంగా 'పుట్టిల్లు' సినిమాతో ఆయనకి అవకాశం వచ్చింది. అయితే ఆ తరువాత కాస్త విషయం ఉన్న పాత్రలు పడి .. పేరు వచ్చేవరకూ ఆర్ధికంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. భార్య బిడ్డలతో అవస్థలు పడుతూనే రోజులు నెట్టుకొచ్చారు.

అల్లు సినిమా రంగానికి వచ్చేసరికి రేలంగి .. రమణా రెడ్డి ఇద్దరూ కూడా ఎదురులేని కమెడియన్స్. లావుగా ఉన్న రేలంగి .. బక్క పల్చగా ఉన్న రమణా రెడ్డి తెలుగు తెరపై తమ జోరును కొనసాగిస్తున్నారు. అప్పట్లో వాళ్ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందువలన కొత్తవాళ్లని పరిచయం చేసే సాహసం ఎవరూ చేసేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో దొరికిన పాత్రలే చేస్తూ .. తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళ్లారు. ఆ తరువాత రాజబాబు - పద్మనాభం నుంచి ఎదురైన పోటీని కూడా ఆయన తట్టుకుని నిలబడవలసి వచ్చింది.

అల్లు ఎంచుకున్న పాత్రల్లో ప్రత్యేకత ఉంది .. నాగభూషణం .. రావు గోపాలరావు వంటి విలన్ల సైడ్ చేరిపోయి, వాళ్లకి దుర్మార్గపు సలహాలిచ్చే పాత్రలను ఎక్కువ చేశారు. ఆ విలన్లతో చీవాట్లు తింటూ .. హీరోలతో తన్నులు తింటూ తెరపై ఆయన చేసే సందడికి థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిసేది. ఒకానొక దశలో అల్లు లేని సినిమా ఉండేది కాదు. అంతలా ఆయన తెలుగు సినిమాను అలుముకున్నారు .. ఆక్రమించారు. మూగమనసులు .. ముత్యాల ముగ్గు .. మన ఊరి పాండవులు ..  శంకరాభరణం .. అందాల రాముడు సినిమాల్లోని పాత్రలు అసమానమైన ఆయన అభినయానికి అద్దం పడతాయి.

అల్లు - రమాప్రభ కాంబినేషన్ కి అప్పట్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. రేలంగి - గిరిజ తరువాత, అంతటి క్రేజ్ ను తెచ్చుకున్న జంట ఇదే. ఈ ఇద్దరిపై ఒక సాంగ్ తప్పకుండా ఉండవలసిందేనని అప్పట్లో నిర్మాతలు పట్టుబట్టేవారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విలక్షణమైన తన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో దశాబ్దాల పాటు నవ్వించిన అల్లు రామలింగయ్యను మనసు ఉన్నంతవరకూ మరిచిపోలేరు. ఆ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు అల్లు బాబీ .. అల్లు అర్జున్ .. అల్లు శిరీష్ కలిసి, హైదరాబాద్ లోని 'అల్లు స్టూడియోస్' లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను స్మరించుకున్నారు. ఆయనతో తమకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  
Tags:    

Similar News