తెలుగుపై అల్లు వారబ్బాయి అభిమానం

Update: 2018-02-16 04:21 GMT
మారుతున్న కాలంలో ఇంగ్లిష్ భాష ప్రాధాన్యం పెరుగుతోంది. ఇదే సమయంలో తెలుగుకు విలువ తగ్గిపోతోంది. తెలుగు నేలపై పుట్టి.. తెలుగు నేలపై చదివి.. తెలుగు వాళ్లందరి మధ్య కలిసి పెరిగినా తమకు తెలుగు రాదని చెప్పుకోవడం గొప్ప అనుకునే పరిస్థితి వచ్చింది. మాతృభాషను కాపాడాలనే మాట వినిపించినా అది తమకు సంబంధించిన విషయం కాదనుకునే వారే ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహార శైలి మరీ ఎక్కువ.

ఈ ధోరణికి భిన్నంగా అల్లు వారబ్బాయి శిరీష్ తెలుగుకు  మద్దతుగా నోరు విప్పాడు. రానున్న ఉగాదిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికీ వెలుగు.. తెలంగాణ తెలుగు’ టైటిల్ లో ఓ హ్యాండ్ బుక్ తయారు చేయించింది. దాదాపు 2.5 కోట్ల పుస్తకాలు తయారు చేయించి తెలుగు వారందరికీ పంచడానికి నిర్ణయిచింది. తెలుగు భాష.. సంస్కృతిని కాపాడే దిశగా ఇదో మంచి నిర్ణయమని ప్రశంసించాడు. దీనిపై ట్విట్టర్ లో తన ఫీలింగ్ షేర్ చేశాడు. రాష్ట్రంలో తెలుగును తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు భాషకు మంచి చేసేలా మరో అడుగు వేసిందంటూ మెచ్చుకున్నాడు.

తెలుగు భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత. ఓ సెలబ్రిటీగా కేవలం తనకు సంబంధించిన అంశం గురించే కాకుండా అమ్మ భాష గురించి శిరీష్ స్పందించడం నిజంగా ప్రశంసనీయం. ఇది ఇండస్ట్రీలో మరింతమందికి స్ఫూర్తినిస్తే తెలుగు భాష మరింతగా వెలుగులీనుతుంది.

Tags:    

Similar News