అమలను ఏడిపించినవాడు దొరికాడు

Update: 2018-02-13 10:15 GMT
హీరొయిన్ అమలా పాల్ ని తన ప్రవర్తనతో లైంగిక మానసిక వేధింపులకు గురి చేసిన 40 ఏళ్ళ అలగేసన్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు. కొద్ది రోజుల క్రితం మలేషియా ఈవెంట్ కోసం డాన్స్ ప్రాక్టీసు చేస్తున్న తన వద్దకు ఒక వ్యక్తి వచ్చి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక తాను బస చేస్తున్న హోటల్ రూమ్ వద్దకు కూడా వచ్చి గొడవ చేసాడని అమలా పాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. కేసు విచారణ చేసిన పోలీసులు అతగాడిని పట్టుకోగలిగారు. నిన్నటి వరకు అమలా పాల్ మేనేజర్ ప్రమేయం కూడా ఇందులో ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలో అమలా పాల్ నిన్న దీని గురించి పూర్తి స్పష్టత ఇస్తూ అతనికి ఈ సంఘటనతో ఎటువంటి సంబంధం లేదని, అలా లేనిపోని వార్తలు సృష్టించి తన మీద అభియోగాలు మోపితే సదరు మీడియా సంస్థల మీద చర్యలు కూడా తీసుకుంటాను అని అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది అమలా పాల్.

మొత్తానికి అసలు నిందితుడు దొరకటం పట్ల కోలీవుడ్ లో హర్షం వ్యక్తం అవుతోంది. దర్శకుడు విజయ్ తో పెళ్లి జరిగాక వైవాహిక జీవితం సరిగా నడవక వ్యవహారం విడాకుల దాకా వచ్చిన అమలా పాల్ కొంత గ్యాప్ తీసుకుని మళ్ళి సినిమాల్లో, ఈవెంట్స్ లో బిజీ గా మారుతోంది. కం బ్యాక్ లో చేసిన అమ్మ కన్ను లాంటి సినిమాలు తనకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. రామ్ చరణ్ నాయక్ సినిమా తర్వాత తెలుగులో ఎక్కువ ప్రయత్నాలు చేయని అమలా పాల్ ఆ తర్వాత మేము అనే పిల్లల సినిమాలో కూడా నటించింది. ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోయి సెటిల్ అవుతున్న టైంలో ఇలా జరగడం తనకు ఇబ్బందిగా ఉంది.

నటి భావన ఉదంతం మర్చిపోక ముందే అమలా పాల్ కు ఇలా జరగడం పట్ల సినిమా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పేరున్న హీరొయిన్లకే ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటే బయట సగటు మహిళలకు రక్షణ ఎలా ఉందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా ఇలాంటి మృగాళ్ళకు కఠిన శిక్షలు విధిస్తే తప్ప మార్పు వచ్చే అవకాశం లేదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News