హీరోలు ద‌ర్శ‌కులే నాశ‌నం చేశారు!-అంబికా కృష్ణ

Update: 2019-05-03 08:35 GMT
టాలీవుడ్ అగ్ర హీరోలు .. ద‌ర్శ‌కులు ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ ఎఫ్‌ డీసీ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ‌. మ‌న‌కు 11 మంది అగ్ర హీరోలు ఉన్నారు. వీళ్లు ఏడాదికి ఒక సినిమా మాత్ర‌మే చేస్తున్నారని విమ‌ర్శించారు. అగ్ర హీరోలు - అగ్ర ద‌ర్శ‌కులు ఏడాదికి ఒక సినిమాయేనా..?  క‌నీసం రెండు సినిమాలు చేయ‌లేరా? అంటూ ప్ర‌శ్నించారాయ‌న‌. దాస‌రి మెమోరియ‌ల్ సినీ అవార్డ్స్ 2019 వేడుక‌లో.. ఆంధ్ర ప్ర‌దేశ్ చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ‌ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ పైవిధంగా వ్యాఖ్యానించారు. అగ్ర హీరోలు ఎక్కువ సినిమాలు తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల థియేట‌ర్లు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని.. ఏపీ- తెలంగాణ‌లో నెల‌రోజులు కూడా థియేట‌ర్ల‌లో సినిమా నిల‌బ‌డ‌డం లేదని విమ‌ర్శించారు. చిన్న సినిమాలు వ‌చ్చినా అవేవీ స‌క్సెస‌వ్వ‌డం లేద‌ని అన్నారు.

ఒక‌ప్పుడు ఎన్టీఆర్- ఏఎన్నార్ ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాల్లో న‌టించేవారు. దాని వ‌ల్ల ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడేది. ఉపాధి దొరికేది. ఆ ఇద్ద‌రు హీరోలు.. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావును న‌వ‌త‌రం హీరోలు.. ద‌ర్శ‌కులు ఆద‌ర్శంగా తీసుకుని సినిమాలు తీయాల‌ని అంబికా కృష్ణ సూచించారు. అయితే ఇదే వేదిక‌పై అంబికా కృష్ణ‌కు సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ వేసిన పంచ్ అంతే పెద్ద గా పేల‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పెద్ద హీరోల‌కు స‌రైన క‌థ‌లు కుద‌ర‌డం లేదు. క‌థ కుదిరితే ఒక‌టికి మించి సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలు ఎప్పుడూ రెడీగా ఉంటార‌ని వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్య ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌ర్థ‌నీయ‌మా.. కాదా? అన్న‌దానిపై ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ స‌హా హీరోల అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

టాలీవుడ్ అగ్ర హీరోలు ఒక‌టికి మించి చేయ‌డం లేదా? అన్న‌ది ప‌రిశీలిస్తే .. ఇప్ప‌టికిప్పుడు ఒక్కొక్క‌రు రెండు మూడు ప్రాజెక్టుల‌తో బిజీగానే ఉన్నారు. అల్లు అర్జున్ ఇటీవ‌లే వ‌రుస‌గా ఏఏ19.. ఏఏ20..ఏఏ 21 చిత్రాల్ని ప్ర‌క‌టించారు. సైమ‌ల్టేనియ‌స్ గానే ఆయ‌న ఈ సినిమాల‌తో బిజీ. ఇక‌పోతే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో.. జాన్ చిత్రాల‌తో బిజీ బిజీ. వీటితో పాటు మ‌రో రెండు క‌థ‌ల్ని లైన్ లో పెట్టారు. రామ్ చ‌ర‌ణ్ .. ఎన్టీఆర్ క్యూలో భారీ చిత్రాలు ఉన్నాయి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ తో మూడు నాలుగు సినిమాలు చేసినంత ప‌ని. పైగా చ‌ర‌ణ్ `సైరా- న‌ర‌సింహారెడ్డి` లాంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తూ ఆ కోణంలోనూ బిజీగానే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైరా పూర్త‌వ్వ‌క ముందే కొర‌టాల‌తో సినిమాపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` రిలీజ్ కి వ‌స్తుండ‌గానే ఎఫ్ 2 ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో సినిమాకి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అంటే మ‌న అగ్ర హీరోలకు ఎక్కువ సినిమాల్లో న‌టించే ఆస‌క్తి లేద‌న‌డం స‌రికాదు. అయితే క్వాలిటీ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది. ఇదివ‌ర‌క‌టిలా వ‌రుస‌గా ఎక్కువ సినిమాలు చుట్టబెట్టేసి ఆడియెన్ ముందుకు వ‌దిలే ఆలోచ‌న ఇప్పుడు లేదు. భారీ బ‌డ్జెట్ల‌తో ప్ర‌యోగాలు చేయలేని స‌న్నివేశం ఉంది. అలాగే బౌండ్ స్క్రిప్టు ప‌క్కాగా కుదిరితే కానీ మ‌న అగ్ర హీరోలు అస్స‌లు సెట్స్ కెళ్ల‌డం లేదు. అంటే ఇది నిర్మాత‌ల ఫ్రెండ్లీ థింకింగ్ అనే భావించాల్సి ఉంటుంది. ఇక‌పోతే మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల్లో మ‌రింత స్పార్క్ పెరిగితే క‌థ‌లు- స్క్రిప్టుల్లో వేగం పెంచితే.. సినిమాలు వేగంగా తీసే స్టైల్ కుదిరితే.. భ‌విష్య త్ లో పెద్దాయ‌న కోరిక ఫ‌లిస్తుందేమో!

    
    
    

Tags:    

Similar News