టీబీతో నరకం అనుభవించా-మెగాస్టార్

Update: 2016-03-08 09:30 GMT
సినిమా వాళ్లకేమండీ.. కోట్లు కోట్లు సంపాదిస్తారు.. వాళ్లకేం కష్టాలుంటాయి అని తేలిగ్గా తీసేస్తాం కానీ.. ఆ కోట్లు సంపాదించేవాళ్లకు కూడా బయటికి చెప్పుకోని కష్టాలు చాలా ఉంటాయి. ఇండియాలో మెగా స్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి కష్టాలు అనుభవించారు. హీరోగా కెరీర్ ముగిసిపోయాక.. రాజకీయాలు - వ్యాపారాల్లో అడుగుపెట్టి సర్వం కోల్పోయిన అమితాబ్.. ఓ సమయంలో ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి చేరిన సంగతి చాలామందికి తెలియదు. ఇలాంటి సమయంలో తన స్థాయి తగ్గించుకుని బుల్లెతెర వైపు అడుగులేసి మళ్లీ కెరీర్ ను చక్కదిద్దుకున్నారాయన. ఆ తర్వాత మళ్లీ మంచి స్థితికి చేరుకుని కుటుంబాన్ని నిలబెట్టుకున్నారు.

ఇది అమితాబ్ లోని ఒక యాంగిల్. ఇంకో కోణం చూస్తే.. ఆయన క్షయ వ్యాధితో ఏడాదికి పైగా నరకం అనుభవించారు. ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలియదు. కొన్నేళ్లుగా టీబీకి సంబంధించి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్న తాజాగా ఓ ఛారిటీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. తాను క్షయ వ్యాధితో పడ్డ ఇబ్బందుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను ట్యూబర్ కులోసిస్ (క్షయ) వ్యాధిగ్రస్తుడిని. 2000 ప్రాంతంలో నాకా వ్యాధి ఉన్నట్లు తేలింది. అదే సమయంలో నేను కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం చేస్తున్నా. నాది వెన్నెముకకు సంబంధంచిన టీబీ కావడంతో నరకం అనుభవించా. ఏడాది పాటు చికిత్స తీసుకుంటే తగ్గింది. ఆ సమయంలో కూర్చోలేకపోయేవాడిని. పడుకోలేకపోయేవాడిని. ముఖ్యంగా కౌన్ బనేగా.. కార్యక్రమం చేస్తున్నపుడు చాలా ఇబ్బంది పడ్డా. రోజుకు 8 నుంచి 10 పెయిన్ కిల్లర్లు వాడేవాడిని. తర్వాత ఆ బాధ నుంచి విముక్తుడినయ్యా. ఇప్పుడు సంతోషంగా నా మనవరాలు ఆరాధ్యతో ఆడుకుంటున్నా. నా మాటలు టీబీ పేషెంట్లలో మనోధైర్యాన్ని నింపుతాయని అనుకుంటున్నా’’ అని అమితాబ్ అన్నారు.
Tags:    

Similar News