లోకల్ ట్రైన్ లో పాటలు పాడిన సూపర్ స్టార్

Update: 2015-11-16 08:42 GMT
మీరు చదివింది అక్షరాల నిజం. ఇదేమీ సినిమా షూటింగ్ కోసమో.. మరో వాణిజ్య కార్యక్రమం కోసం ఆయనీ పని చేయలేదు. అసలుసిసలు ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన బిగ్ బీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఇంత పని చేశారు. లేటు వయసులో ఎంతో హుషారుగా ఉంటే ఈ సూపర్ స్టార్ తాను రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేశారు. తాజాగా ఆయన చేసిన  ప్రయత్నంపై ముంబయి వాసుల మదిని దోచుకోవటమే కాదు.. సోషల్ నెట్ వర్క్స్ లలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ బిగ్ బి లోకల్ ట్రైన్ లో పాటలు పాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..?

ముంబయిలోని పేదలు పలువురు పెద్ద సంఖ్యలో కేన్సర్ తో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు.. వారికి వైద్య సాయం అందించేందుకు సారభక్ నింబ్కర్ అనే అతను లోకల్ ట్రైన్ లలో తిరుగుతూ పాటలు పాడుతూ డబ్బులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించిన విరాళాలతో ఆయన పేదలకు కేన్సర్ చికిత్స చేయిస్తుంటారు.

ఈ విషయం తెలుసుకున్న బిగ్ బీ తాను కూడా లోకల్ ట్రైన్ ఎక్కారు. విక్టోరియా టెర్మినల్ నుంచి భందుప్ స్టేషన్ వరకూ రైల్లో ప్రయాణించిన బిగ్ బీ.. సిల్ సిలా చిత్రంలో తాను పాడిన ‘‘రంగ్ బర్ సే’’ పాటను స్వయంగా ఆలపించి ప్రయాణికుల్ని హుషారెత్తించారు. బిగ్ బీ లాంటి వ్యక్తి వచ్చి స్వయంగా పాట పాడటంతో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వారంతా విస్మయానికి గురయ్యారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాటలు పాడి విరాళాలు సేకరించే సారభక్ కు కూడా ముందస్తుగా చెప్పకుండా రైలెక్కి ఆయనతో కలిసి బిగ్ బీ పాటలు పాడటం విశేషం. తానీ పనిని సోషల్ మీడియాలో ప్రచారం కోసం కాకుండా.. సారభక్ లాంటి వారికి మరింత సాయంగా నిలవాలన్న ఉద్దేశంతోనే తానీ పని చేసినట్లు పేర్కొన్నారు. ఏమైనా.. బిగ్ బీ.. బిగ్ బినే. ఆయన సాటి మరెవరూ రాలేరు.
Tags:    

Similar News