బాలయ్యకు నో చెప్పాడు.. సూర్యతో చేస్తున్నాడు

Update: 2018-08-31 04:01 GMT
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ ను దక్షిణాదికి తీసుకురావాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన ఇటు వైపు చూడలేదు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడ్డారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమా చేయడానికి సిద్ధమైన బాలయ్య అందులో ఐదు నిమిషాల నిడివి ఉన్న ఓ ముఖ్య పాత్రను అమితాబ్ తో చేయించాలనుకున్నారు. కృష్ణవంశీ గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా బిగ్-బిని బాలయ్య కలిశాడు కూడా. అమితాబ్ ఈ పాత్ర చేస్తానంటేనే సినిమా ఉంటుందని.. లేదంటే లేదని బాలయ్య స్వయంగా చెప్పాడు అప్పట్లో. కానీ ఈ సినిమా ముందుకు కదలకపోవడాన్ని బట్టి అమితాబ్ ఇందులో నటించడానికి అంగీకరించలేదని అంతా అర్థం చేసుకున్నారు.

ఐతే బాలయ్యకు నో చెప్పిన అమితాబ్.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఈ విషయం పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు అమితాబ్ ఓ తమిళ చిత్రం చేయడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘సైరా’లో మాదిరి ఇక్కడ ఆయనది అతిథి పాత్ర కూడా కాదు. తొలిసారిగా తమిళంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు అమితాబ్. ఇదేమీ భారీ సినిమా కూడా కాదు. తమిళ్ వానన్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇందులో అమితాబ్  తో పాటు డైరెక్టర్ టర్న్ డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషించనుండటం విశేషం. ఈ చిత్రం తమిళ.. హిందీ భాషల్లో తెరకెక్కుతుందట.  ఇంతకుముందు ధనుష్ తో కలిసి హిందీలో ‘షమితాబ్’ సినిమా చేశాడు బిగ్-బి. ఇప్పుడు మరోసారి తన తమిళ అభిమానాన్ని చాటుకుంటున్నాడాయన.

Tags:    

Similar News