ప్లాప్‌ డైరెక్టర్‌ కు మల్టీస్టారర్‌ ఛాన్స్‌

Update: 2020-10-15 23:30 GMT
తమిళంలో 'అరిమనంబి' అనే సినిమాతో 2014లో దర్శకుడిగా పరిచయం అయిన ఆనంద్‌ శంకర్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండతో 'నోటా' సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. అంతుకు ముందు విక్రమ్‌ తో తీసిన ఇంకొక్కడు సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యింది. చేసిన మూడు సినిమాల్లో రెండు ఫ్లాప్‌ లు ఒకటి యావరేజ్‌ గా నిలవడంతో ఈయన సినీ కెరీర్‌ దాదాపుగా ఖతం అయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2018లో నోటా విడుదల అయ్యింది. అప్పటి నుండి ఆనంద్‌ శంకర్‌ కొత్త సినిమా ప్రయత్నం చేస్తున్నా పలువురు హీరోలు ఈయన్ను దూరం పెట్టారట. ఒకరు ఇద్దరు తెలుగు యంగ్‌ హీరోలకు సైతం ఈయన కథ చెప్పేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఎట్టకేలకు ఆనంద్‌ శంకర్‌ కు ఒక క్రేజీ కాంబో మల్టీస్టారర్‌ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విశాల్‌ హీరోగా మరో యంగ్‌ హీరో ఆర్య విలన్‌ గా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుందట. భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ కాంబోలో మూవీ ఉంటుందని అంటున్నారు. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం విశాల్‌ చేస్తున్న రెండు సినిమాలు కూడా పూర్తి అవ్వాల్సి ఉంది. ఆ సినిమాలు పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు ఈ మల్టీస్టారర్‌ పట్టాలెక్కవచ్చు అంటున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చిన రెండు పెద్ద సినిమాలు ఫ్లాప్‌ అయినా వాటికి దర్శకత్వం వహించిన దర్శకుడికి ఇలా క్రేజీ మల్టీస్టారర్‌ కు దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా వండర్‌ అంటూ కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఆనంద్‌ శంకర్ సక్సెస్‌ ను దక్కించుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News