రీమేక్‌ సరే.. రీచ్ అవ్వగలరా!

Update: 2021-10-07 10:30 GMT
ఒక సినిమా సక్సెస్ అవ్వగానే ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు ఫిల్మ్ మేకర్స్. ఒరిజినల్‌ని రీచ్ అవుతున్నారా అంటే మాత్రం జవాబు చెప్పడం కష్టం. ముఖ్యంగా ‘అంధాధున్‌’ లాంటి కల్ట్ మూవీస్‌ విషయంలో ఆడియెన్స్ పెదవి విరిచే ప్రమాదం ఎక్కువే. ఈ మూవీ ఇటీవలే తెలుగులో ‘మాస్ట్రో’గా వచ్చింది. తమిళంలో ‘అంధగన్‌’గా తెరకెక్కుతోంది. రేపు మలయాళంలో ‘భ్రమమ్‌’గా రిలీజవుతోంది. పైగా ‘అంధాధున్‌’ రిలీజై మూడేళ్లు కావడంతో ఈ టాపిక్‌ మరోసారి తెరపైకొచ్చింది

 సినిమాని నేచురల్‌గా తీయాలని కొంతమంది దర్శకులు ఎలా అనుకుంటారో.. అత్యంత సహజంగా నటించాలని కొందరు యాక్టర్స్ కూడా ఆరాటపడతారు. అలాంటి హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయుష్మాన్ గురించి. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలాగే అనిపిస్తాడు తప్ప నటన అనే ఫీలింగ్ కలగనివ్వడు. ఇక ‘అంధాధున్’ కోసం అతడు చేసిన హార్డ్ వర్క్ గురించి తెలిస్తే వహ్వా అనకుండా ఉండలేరెవ్వరూ.

 ఈ సినిమాలో ఆయుష్మాన్‌ చూపులేని వాడిగా కనిపించడం కోసం సెక్లెరల్ లెన్స్ రెడీ చేశారట. ఇవి చాలా కాస్ట్‌లీ. కొందామంటే దొరకవు కూడా. అందుకే ఆర్డర్ చేసి మరీ తయారు చేయించాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. అయితే ఇవి పెట్టుకోగానే ఎనభై శాతం చూపు తగ్గిపోతుందట. ఆపైన బ్లాక్‌ గ్లాసెస్ కూడా పెట్టుకోవాలి కాబట్టి మరో పది శాతం విజన్ తగ్గుతుందట. అవి కళ్లకి ఉన్నంతసేపు ఈ ఇబ్బంది తప్పదు. అయినా కూడా వాటిని పెట్టుకునే నటించాడు ఆయుష్మాన్.

 తొంభై శాతం చూపు లేకపోవడమంటే దాదాపు బ్లైండ్ కిందే లెక్క. అయినా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి నిజమైన అంధుడిలా అద్భుతంగా నటించాడు. మ్యుజీషియన్ రోల్ కాబట్టి పియానో కూడా నేర్చుకున్నాడు ఆయుష్మాన్. ఆ సమయంలో కూడా ఐ మాస్క్ వేసుకునే ఉండేవాడట. పర్‌‌ఫెక్షన్‌ కోసమని డైలీ చేసుకోవాల్సిన పనులు కూడా ఐ మాస్క్ వేసుకునే చేసేవాడట. అంత కష్టపడ్డాడు కాబట్టే నేషనల్ అవార్డు సైతం వరించింది. దాంతో రీమేక్స్‌పై అందరి దృష్టీ ఉంది. తెలుగులో ఆల్రెడీ డిజప్పాయింట్ చేసింది. మరి మిగతా భాషల్లో ఎలా ఉంటుందో, ఏ ఒక్కరైనా తమ పర్‌‌ఫార్మెన్స్‌తో ఆయుష్మాన్‌ని రీచ్ అవ్వగలరేమో చూడాలి!
Tags:    

Similar News