క‌లెక్ష‌న్ కింగ్ న‌టించు ఆండ్రాయిడ్ 2.0

Update: 2022-10-12 05:31 GMT
ఇరుగుపొరుగు భాష‌ల్లో బంప‌ర్ హిట్లు కొట్టిన సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డం చాలా కాలంగా కొన‌సాగుతున్న ట్రెండ్. దీనికి రివ‌ర్సులో తెలుగులో బంప‌ర్ హిట్లు కొడుతున్న సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసేందుకు దిగ్గ‌జాలు పోటీప‌డుతున్నారు. అదంతా అటుంచితే ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళ బ్లాక్ బస్ట‌ర్ల‌ను మ‌న‌వాళ్లు వెంట‌నే వెతికి ప‌ట్టుకుంటున్నారు. తెలుగులో రీమేక్ లు చేసి హిట్లు కొడుతున్నారు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ లూసీఫ‌ర్ రీమేక్ 'గాడ్ ఫాద‌ర్'. మెగాస్టార్ న‌టించిన ఈ సినిమా త‌న‌కు ఆచార్య లాంటి ఫ్లాప్ త‌ర్వాత అద్భుత‌మైన కంబ్యాక్ ని ఇచ్చింది.

ఇప్పుడు క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు కూడా అలాంటి ఒక మంచి హిట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. చిరంజీవికి స‌మ‌కాలికుడు సీనియ‌ర్ హీరో అయిన మంచు మోహ‌న్ బాబు చాలా కాలంగా స‌రైన హిట్టు లేక రేసులో వెన‌క‌బ‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు త‌గ్గించారు.

తాజా స‌మాచారం మేర‌కు మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ని ఇందులో మోహ‌న్ బాబు నటిస్తార‌ని తెలిసింది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ దర్శకత్వం వహించిన మాతృక‌ చిత్రంలో సూరజ్ వెంజరమూడు- సౌబిన్ షాహిర్ - సూరజ్ తేలక్కడ్ ప్రధాన పాత్రలు పోషించారు.

తండ్రి - కొడుకుల మధ్య సంబంధాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే డ్రామాతో ఈ సినిమా ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇందులోనే సైన్స్ ఫిక్షన్ నేప‌థ్యం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నటుడు-నిర్మాత మంచు విష్ణు సొంతం చేసుకున్నారు.

తాజాగా విష్ణు మాట్లాడుతూ 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' తెలుగు రీమేక్ వచ్చే ఏడాది జనవరి నాటికి సెట్స్ పైకి వెళుతుంద‌ని క్లూ ఇచ్చారు. ఇందులో మోహన్ బాబు నటిస్తార‌ని...ఆయ‌న‌ కొడుకు పాత్ర‌ కోసం ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేయనున్నట్టు విష్ణు తెలిపారు. కొడుకు పాత్రలో మీరే న‌టించ‌వ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. డాడ్ ముందు భ‌యంవ‌ల్ల చేయ‌న‌ని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం విష్ణు తాజా చిత్రం 'జిన్నా' ప్ర‌చారంలో వేగం పెంచేందుకు ప్ర‌ణాళిక‌తో ఉన్నారు. అక్టోబర్ 21 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జిన్నా ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ఇప్ప‌టికే వెబ్ లో అందుబాటులో ఉంది. ఈసారి విష్ణు ఓ విభిన్న‌మైన క‌థాంశాన్ని ఎంచుకుని ప్ర‌యోగం చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News