ఫ్లాపులు వచ్చినా నిర్మాతలు ఎందుకు ఈ హీరోలనే ఎంచుకుంటున్నారు?
అటు మార్కెట్ పడిపోయినా, ఇటు ఓపెనింగ్స్ అంతగా లేకున్నా ఈ హీరోల మీద నిర్మాతలు ఎందుకు వెనకడుగు వేయడం లేదు? ఇదే ఇప్పుడు పరిశ్రమలో పెద్ద ప్రశ్నగా మారింది.;
సినిమా ఇండస్ట్రీలో హీరోల రేంజ్ అనేది బాక్సాఫీస్ వసూళ్లను బట్టే నిర్ణయించాలి. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా వ్యతిరేకమైన ట్రెండ్ కనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో నిర్మాతలను నష్టాల్లో ముంచుతున్నా, కొందరు హీరోలకు భారీ రెమ్యూనరేషన్‌లు అందుతున్నాయి. అటు మార్కెట్ పడిపోయినా, ఇటు ఓపెనింగ్స్ అంతగా లేకున్నా ఈ హీరోల మీద నిర్మాతలు ఎందుకు వెనకడుగు వేయడం లేదు? ఇదే ఇప్పుడు పరిశ్రమలో పెద్ద ప్రశ్నగా మారింది.
దీనికి ప్రధాన కారణం ‘సినిమా తీయాలనే ఉత్సాహం’ మాత్రమే కాదు. కొందరు నిర్మాతలు ఓటీటీ డీల్స్, ఇతర నాన్ థియేట్రికల్ వసూళ్లతో లాభాలు అందుకోవచ్చనే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడది కూడా అంతంతమాత్రంగా మారిపోవడంతో అసలు లెక్క గల్లంతవుతోంది. కొందరు పెద్ద స్టార్లు మాత్రమే థియేట్రికల్ బిజినెస్‌లో నిలబడగలుగుతున్నారు. మిగతావారు అయితే నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి సరైన రిటర్న్స్ తీసుకురావడంలో విఫలమవుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొందరు హీరోలు కథకంటే రెమ్యూనరేషన్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అటు నిర్మాతలు కూడా కంటెంట్ కంటే కాస్త పాపులారిటీ ఉన్న హీరో ఉండాలనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఉదాహరణకు, శర్వానంద్ వంటి మిడ్ రేంజ్ హీరోలు గతకొంత కాలంగా సినిమాలను ప్రాఫిట్స్ లోకి తెచ్చింది లేదు. ఎంతమాత్రం ఓపెనింగ్స్ లేకున్నా, 7 నుంచి 10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇక ఓటీటీ మార్కెట్ తగ్గిపోవడం కూడా సమస్యగా మారింది. శాటిలైట్ అయితే ఆల్ మోస్ట్ డెడ్ అనే పరిస్థితికి వచ్చింది. గతంలో చిన్న సినిమాలు ఓటీటీలో బాగానే డీల్ కుదుర్చుకునేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఖచ్చితమైన లెక్కలతో ముందుకు సాగుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందని సినిమాలు ఓటీటీలో పెద్దగా ఆఫర్స్ అందుకోవడం లేదు. దీంతో ఈ హీరోల సినిమాలు నిర్మాతలకు మరింత భారంగా మారుతున్నాయి.
ఇంకా ఒక సమస్య ఏమిటంటే, ఈ తరహా హీరోల సినిమాలు పెట్టుబడిని సాధ్యమైనంతవరకు తిరిగి తెచ్చుకునేలా ప్లాన్ చేయడం లేదు. మార్కెట్‌ను బట్టి బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ పని జరగకుండా సరైన లెక్కలు లేకుండా సినిమాలు మొదలవడం వల్ల ఫైనల్‌గా నిర్మాతలకే భారంగా మారుతోంది.
ఈ పరిస్థితి మారాలంటే హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాలి, లేదా షేర్ ప్రాఫిట్ తరహాలో నిర్మాతలపై భారం పడకుండా డీల్స్ మాట్లాడుకోవాలి. అలాగే కొత్త తరం కథలను ఎంచుకోవాలి. మార్కెట్ తగ్గినప్పుడు కూడా అదే విధంగా భారీ డిమాండ్స్ చేస్తే, ఇండస్ట్రీలో మధ్య తరహా సినిమాలకు పూర్తిగా ప్రమాదం వాటిల్లే అవకాశముంది. కాబట్టి, స్టార్ స్టేటస్‌కి మాత్రమే కాదు, ప్రేక్షకుల ఆదరణకి విలువ ఇచ్చే కొత్త ట్రెండ్ వస్తేనే, ఈ బరువు నిర్మాతలపై తగ్గే అవకాశం ఉంటుంది.