కన్నప్ప డీల్ విషయంలో విష్ణు రిస్కులు
అయితే పరిశ్రమలో పేరున్న మంచు విష్ణు నటించి, నిర్మించిన కన్నప్ప ఓటీటీ డీల్ త్వరగా సెట్ కాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.;
ఓటీటీల ప్రవేశంతో సినిమా బిజినెస్ తీరు తెన్నులు మారిపోయాయి. ఓటీటీ డీల్స్ కొంతవరకూ నిర్మాతను ఆదుకుంటున్నాయి. అయితే ఇదే అదనుగా ఓటీటీ సంస్థలు అవకాశవాదం ప్రదర్శించడంపై అసంతృప్తి నెలకొంది. పేరున్న అగ్ర హీరోలతో ఒకలా... అంతగా గుర్తింపు లేని హీరోలతో ఇంకోలా ప్రవర్తిస్తున్నాయి.
అయితే పరిశ్రమలో పేరున్న మంచు విష్ణు నటించి, నిర్మించిన కన్నప్ప ఓటీటీ డీల్ త్వరగా సెట్ కాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాకి ఈ పరిస్థితి ఊహించనిది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్లు నటించారు.
ఇది భారీ మల్టీస్టారర్ చిత్రం. అయినా కానీ, సినిమా చూడకుండా ఓటీటీ డీల్ ఫైనల్ చేయలేమని ఓటీటీ సంస్థలు తెగేసి చెప్పేస్తుండడంతో దానికి నిర్మాత అయిన మంచు విష్ణు ససేమిరా అనేస్తున్నారట. సినిమా చూశాక నచ్చితేనే డీల్ కుదుర్చుకునే ధోరణిని ఓటీటీలు అనుసరిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు సినిమా చూశాకే ఒప్పందం చేసుకుంటామని చెబుతున్నాయి.
అయితే సినిమా కంటెంట్ పై నమ్మకంతోనే మంచు విష్ణు ఇంత మొండి పట్టుపడుతున్నారా? 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో రిస్కు దేనికి? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద బడ్జెట్ ఖర్చు చేయడానికి గట్స్ ఉండాలి. ఇలాంటివి రిలీజ్ ముందే సేఫ్ జోన్ లో ఉండాలి. రిలీజయ్యాక తేడా కొడితే డ్యామేజ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయినా మంచు విష్ణు మొండిగా ముందుకు వెళ్లడం సరైనదేనా?