ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ కలయికలో!
ఆలియా షేర్ చేసిన వీడియోలో ఆమీర్- రణ్‌బీర్ ఫోటో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. 'అల్టిమేట్ బ్లాక్‌బస్టర్' అనే క్యాప్షన్ కూడా దీనిపై కనిపించింది.;
భారతదేశంలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్.. అమీర్ ఖాన్ - రణబీర్ కపూర్ కలిసి నటిస్తే.. ఈ ఆలోచనే ఎంతో క్రేజీగా ఉంది కదూ? నిజంగానే ఇది సాధ్యమవుతోంది. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం దిగ్గజాలు కలిసి పనిచేయనున్నారు. తాజాగా రణబీర్ సతీమణి, అగ్ర కథానాయిక ఆలియా భట్ ఇన్‌స్టా ఫ్యాన్స్ కోసం ఈ అద్భుతమైన అప్‌డేట్‌ను షేర్ చేసింది. రణ్‌బీర్ - ఆమీర్ ఒక ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తున్నారని, ప్రాజెక్ట్ వివరాలు మార్చి 12 బుధవారం నాడు వెల్లడిస్తారని ఆలియా తెలిపింది.
ఆలియా షేర్ చేసిన వీడియోలో ఆమీర్- రణ్‌బీర్ ఫోటో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. 'అల్టిమేట్ బ్లాక్‌బస్టర్' అనే క్యాప్షన్ కూడా దీనిపై కనిపించింది. నితీష్ తివారీ పేరు పోస్టర్ పై ఉంది. ''తెరపై గొప్పగా పోటీ పడే నా ఫేవరెట్ స్టార్స్ ''ఉత్తమమైన యుద్ధం! ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు!'' అని ఆలియా తెలిపింది. ''చాలా ఎగ్జయిట్ చేసే వార్త కోసం వేచి ఉండండి... రేపు మరిన్ని డీట్స్ వస్తున్నాయి. నేను ఇష్టపడినంతగా మీరు దీన్ని ఇష్టపడతారని నాకు తెలుసు!'' అని ఆలీయా క్యాప్షన్‌లో రాసింది. ఆలియా ప్రకటన నెటిజనులను చాలా ఉత్సాహపరిచింది. ఈ పోస్ట్ షేర్ చేయగానే, లెజెండ్స్ కొలువుదీరుతున్నారు అని అభిమానులలో ఒకరు రాశారు.
అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలు. ఈ ఇద్దరి కలయికలో సినిమా తెరకెక్కనుండడం నిజంగా ఆసక్తిని కలిగించేదే. రణబీర్ కపూర్ తో 'రామాయణం' తెరకెక్కిస్తున్న నితీష్ తివారీ వెంటనే రణబీర్ -అమీర్ కాంబినేషన్ మూవీకి ప్లాన్ చేయడం నిజంగా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే రామాయణం చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఆ రెండు భాగాలు రిలీజయ్యాకే అమీర్- రణబీర్ కాంబినేషన్ మూవీ సెట్స్ కెళ్లేందుకు ఆస్కారం ఉంది.
ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' కోసం కలిసి పనిచేయనున్నారు, ఇందులో విక్కీ కౌశల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.