సిల్లీ ఫెలోస్ కు భలే ఆఫర్

Update: 2018-08-27 08:03 GMT
తెలివిగా ప్లాన్ చేసుకోవాలే కానీ బడ్జెట్ సినిమాలతో కూడా మంచి లాభాలు కొట్టేయొచ్చని ఈ మధ్య వచ్చిన కొన్ని విజయాలను కళ్లారా చూస్తున్నాం. అన్నింటికీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం కానీ కంటెంట్ ఉందని నమ్మితే చాలు మంచి రేట్ తో కొనేందుకు ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఇప్పుడు సిల్లీ ఫెలోస్ అలాంటి ఛాన్స్ కొట్టేసింది. నిన్న ట్రైలర్ విడుదలయ్యాక రెస్పాన్స్ బాగానే వచ్చిన సంగతి తెలిసిందే. కామెడీ పరంగా వేర్వేరు బ్రాండ్ ఇమేజ్ ఉన్న అల్లరి నరేష్ సునీల్ కాంబోలో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. సుడిగాడుతో కామెడీ జానర్ ను సైతం బాగా డీల్ చేయగలను అని ఋజువు చేసుకున్నాడీయన. అందుకే సిల్లీ ఫెలోస్ ట్రైలర్ మార్కెట్ లోకి రావడం ఆలస్యం ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ సినిమాను నైజామ్-నెల్లూరు ఏరియాలతో పాటు ఈస్ట్ వెస్ట్ ని హోల్ సేల్ గా కొనేశారట. ఈయన ఇటీవలే గూఢచారిని గంపగుత్తగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొనేసి మంచి లాభాలు కళ్ళజూశారు.

సిల్లీ ఫెలోస్ ని ఆంధ్రలో మూడు ఏరియాలకు గాను మూడున్నర కోట్ల దాకా నైజామ్ ప్రాంతానికి రెండు కోట్ల మార్క్ కు కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకుని తీసుకున్నట్టు సమాచారం. అంటే సిల్లీ ఫెలోస్ కు అయిన బడ్జెట్ లో సగం ఈయనే వెనక్కు ఇచ్చేసినట్టు. ఇంకా సీడెడ్ లాంటి ప్రాంతాలు బాలన్స్ ఉన్నాయి. వాటితో పాటు డిజిటల్ అంటూ డబ్బింగ్ అంటూ శాటిలైట్ అంటూ అదనపు ఆదాయ మార్గాలు ఉండనే ఉన్నాయి. సో టేబుల్ ప్రాఫిట్స్ తో సిల్లీ ఫెలోస్ పేరులో ఉన్నంత సిల్లీగా కాకుండా  సీరియస్ గానే బిజినెస్ జరుపుకుంటోంది. అల్లరి నరేష్ సునీల్ కాంబోలో సినిమా వచ్చి చాలా కాలమయ్యింది కాబట్టి అది కూడా హైప్ రావడానికి ఓ కారణం అవుతోంది. సెప్టెంబర్ 7న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News