స్పెష‌ల్ స్టోరీ : వార‌సులొస్తున్నారండోయ్‌

Update: 2022-05-28 02:30 GMT
టాలీవుడ్ లో వార‌సుల‌కు కొద‌వ‌లేదు. క్రేజీ స్టార్ ల‌కు సంబంధించిన వార‌సులు హీరోలుగా ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చేశారు. ఓ త‌రం దాటి మ‌రో త‌రం కూడా త‌మ స‌త్తాని చాటుకుంటోంది. ఇందులో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఇండ‌స్ట్రీలో స్టార్ లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. కొంత మంది స్టార్ డ‌మ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ త‌రువాత బాల‌కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత హ‌రికృష్ణ త‌న‌యులు క‌ల్యాణ్ రామ్‌, ఎన్టీఆర్ తెరంగేట్రం చేసి హీరోలుగా రాణిస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌రువాత నాగార్జున త‌న‌దైన మార్కు సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

నాగ్ లైన్ లో వుండ‌గానే ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు, మూడ‌వ త‌రం వార‌సులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ అక్కినేని హీరోలుగా రాణిస్తున్నారు. స్టార్ డ‌మ్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆ త‌రువాతి త‌రంగా రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, పంజా వైష్ణ‌వ్ తేజ్ ట్రాక్ లో వున్నారు. ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంక‌టేష్ త‌రువాత రానా లైన్ లోకి వ‌చ్చాడు. త్వ‌ర‌లోనే అత‌ని సోద‌రుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ఇదిలా వుంటే నంద‌మూరి, మెగా, ద‌గ్గుబాటి, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీస్ నుంచి మ‌రో త‌రం వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నాలుగు ఫ్యామిలీల నుంచి కొత్త త‌రం హీరోలు రాబోతున్నారు. ముందుగా నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ తెరంగేట్రం చేయ‌బోతున్నాడంటూ గ‌త కొన్నేళ్లుగా వార్త‌లు వినిపిస్తూనే వున్నాయి. కోవిడ్ కి ముందు బాల‌కృష్ణ న‌టించిన 'గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి' సినిమా టైమ్ లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి వార్త‌లు వినిపించాయి. త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేసే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని స్వ‌యంగా బాల‌కృష్ణ వెల్ల‌డించారు.

క్రిష్ లేదా బోయ‌పాటి శ్రీ‌ను అత‌న్ని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల్ని తీసుకుంటారంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఆ త‌రువాత బాల‌కృష్ణ‌తో సింగీతం శ్రీ‌నివాస‌రావు 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా చేయాల‌నుకున్న 'ఆదిత్య 999' ద్వారా మోక్ష‌జ్ఞ‌ని ప‌రిచ‌యం చేస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. క‌థ‌లో బాల‌కృష్ణ మార్పులు కోర‌డంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్ప‌టికైనా మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం వుంటుందా? అంటూ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. జూన్ 10న నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు వేడుక‌లు క‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆరోజైనా మోక్ష‌జ్ఞ ఎంట్రీ కి సంబంధించిన వార్తని బాల‌కృష్ణ ప్ర‌క‌టిస్తార‌ని ఆశిస్తున్నారు.

ఇదే త‌ర‌హాలో మెగా వార‌సుడి గురించి కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే అకీరా గ్రాడ్యుయేష‌న్ ని పూర్తి చేసుకున్నాడు. దీంతో వ‌చ్చే ఏడాది అకీరా ఎంట్రీ వుంటుంద‌ని మెగా ఫ్యాన్స్ నెట్టింట హాంగామా చేస్తున్నారు. దీనిపై ఇంత వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి కానీ, రేణు దేశాయ్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా వెంక‌టేష్ త‌న‌యుడి ఎంట్రీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ త‌న‌యుడు అర్జున్ కూడా హీరోగా ఎంట్రీ ఏజ్ కి వ‌చ్చేశాడు. ఇటీవ‌ల వెంక‌టేష్ పెద్ద కుమార్తె వివాహ వేడుక‌లో అర్జున్ సంద‌డి చేశాడు. రానా త‌రహాలో హైట్ పెరిగిన అర్జున్ ఇంత వ‌ర‌కు త‌న  అరంగేట్రం గురించి ఎలాంటి లీక్ ని వ‌ద‌ల‌క‌పోవ‌డంతో వెంక‌టేష్ ఫ్యాన్స్ వార‌సుడి ఎంట్రీ వుంటుందా? వుండ‌దా? అని ఆలోచ‌న‌లో ప‌డుతున్నార‌ట‌. వెంక‌టేష్ కూడా ఈ విష‌యం గురించి ఇంత వ‌ర‌కు ఎక్క‌డా ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వీళ్ల త‌రువాత ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు ఘ‌ట్ట‌మ‌నేని గౌత‌మ్‌. సూప‌ర్ స్టార్ కృష్ణ ముద్దుల మ‌న‌వ‌డు, మ‌హేష్ బాబు త‌న‌యుడు గౌత‌మ్ తెరంగేట్రం కోసం మ‌హేష్, కృష్ణ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదే గైత‌మ్ ఎస్‌.ఎస్. సీ పూర్తిచేసుకుని ఏ గ్రేడ్ లో పాస‌య్యాడు. త‌ను హీరోగా ఎంట్రీ అంటే మ‌రో మూడేళ్లు వేచి చూడాల్సిందే. ఇంత‌కీ గౌత‌మ్ కు హీరోగా తెరంగేట్రం చేసే ఆలోచ‌న వుందా?  లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు.

మ‌హేష్ ముద్దుల కుమార్తె సితార మాత్రం న‌టిగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిని చూపిస్తూ నెట్టింట ఇన్ స్టా వేదిక‌గా వీడియోలు చేస్తూ వ‌స్తోంది. ఇలా స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి మ‌రో త‌రం వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చే వేళైనా ఇంకా ఎవ‌రి నుంచి స‌రైన క్లారిటీ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆకాశం వంక వ‌ర్షం కోసం ఎదురుచూస్తున్న‌ట్టుగా వేచి చూస్తున్నారు. వారికి స్టార్ ఫ్యామిలీస్‌ గుడ్ న్యూస్ ని ఎప్పుడు చెబుతాయో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News