'భీమ్లా నాయక్' కోసం మరో కొత్త రిలీజ్ డేట్..?

Update: 2022-02-14 04:58 GMT
పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ''భీమ్లా నాయక్'' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని, అప్పుడెప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ కరోనా ప్రభావం వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు పవన్ పాల్గొనే ఫైనల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

సంక్రాంతి రేసు నుంచి తప్పించిన 'భీమ్లా నాయక్' సినిమా కోసం రెండు రిలీజ్ డేట్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25న అనుకూలించకపోతే ఏప్రిల్ 1న థియేటర్లోకి తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చి నైట్ కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తేస్తే అప్పుడు సినిమాని విడుదల చేస్తామని నిర్మాత పేర్కొన్నారు.

ఏపీలో ఈరోజు వరకు కొనసాగిన కోవిడ్ ఆంక్షలు.. రేపటి నుంచి ఎత్తేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అలానే ఫిబ్రవరి మూడో వారానికి సినిమా టికెట్ రేట్ల మీద కొత్త జీవో వస్తుందని వార్తలు వస్తున్నాయి. అందులోనూ 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్స్ నిర్మించిన 'డీజే టిల్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనిని బట్టి సినిమా బాగుంటే కరోనా పరిస్థితుల్లోనూ జనాలు థియేటర్లకు వస్తున్నారని అర్థం అవుతోంది.

ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీనే తెలుగుతో పాటుగా హిందీలో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ముందుగా ప్రకటించిన రెండు తేదీలలోనూ రావడం లేదని.. ఏప్రిల్ 8న విడుదల కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన 'వలిమై' సినిమా అని అంటున్నారు.

'వలిమై' చిత్రాన్ని ఫిబ్రవరి 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన నాలుగు ఏరియాల హక్కులను 'భీమ్లా నాయక్' నిర్మాతలు తీసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ డీల్ కారణంగానే పవన్ సినిమాని ఈ నెల 25 నుంచి తప్పించి.. ఏప్రిల్ 8న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌ లో టాక్ నడుస్తోంది.

'భీమ్లా నాయక్' సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇది మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో చాలా వరకు మార్పులు చేసారని తెలుస్తోంది.

ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని - బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
    
    
    

Tags:    

Similar News