తెరపైకి మరో రామాయణం.. రాముడు ఎవరంటే..?

Update: 2022-10-05 03:05 GMT
ఎన్నిసార్లు చదివినా.. ఎన్నిసార్లు విన్నా తనవి తీరని కావ్యం 'రామాయణం' అంటుంటారు. అందుకే ఆ మహా కావ్యం ఆధారంగా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఇకపై వస్తూనే ఉంటాయి.

'ఆదిపురుష్' సినిమా టీజర్ రిలీజైన దగ్గర నుంచి దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ రామాయణం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే ఇతిహాసం ఆధారంగా రూపొందనున్న "సీత: ది ఇంకార్నేషన్" చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్‌ లో రూపొందనున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో 'సీత: ది ఇంకార్నేషన్' ఒకటి. అలౌకిక్‌ దేశాయి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ఇందులో క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

ఇప్పటికే ఈ పౌరాణిక గాథకు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు టైటిల్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. సీత పాత్రలో కంగనా కనిపిస్తుందని తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇందులో శ్రీరాముడు - రావణుడు పాత్రలలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ "సీత: ది ఇంకార్నేషన్" చిత్రంలో లార్డ్ శ్రీరామ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు అలౌకిక్ దేశాయ్ ఇటీవల విక్రమ్‌ ను కలిశాడని.. దర్శకుడు కాన్సెప్ట్‌ తో విక్రమ్ సంతృప్తి చెందారని అంటున్నారు.

'సీత' సినిమాలో విక్రమ్ భాగం కానున్నారని చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కీలక పాత్ర కోసం దర్శకుడు అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. రాముడిగా విక్రమ్ మరియు సీత గాకంగనా రనౌత్ ను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అలానే రావణ్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

కాగా, భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా' సీత: ది ఇంకార్నేషన్' సినిమా చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాకు పూర్తి భిన్నంగా సీతాదేవి కోణంలో ఈ సినిమా ఉండబోతోంది.

ఎవరూ వెండితెరపై చూపించని.. ఎవరికీ తెలియని సరికొత్త ‘సీత’ ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్న8 వీఎఫ్ఎక్స్ సాంకేతికతో ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు.

"సీత: ది ఇంకార్నేషన్" చిత్రాన్ని హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో బ్యానర్ పై సలోని శర్మ మరియు అన్షితా దేశాయ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మనోజ్‌ ముంతాషీర్ ఈ చిత్రానికి సాహిత్యం మరియు సంభాషణలు సమకూరుస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Tags:    

Similar News