రంగస్థలం ముందు అన్నీ దిగదుడుపే..

Update: 2018-07-05 15:30 GMT
ఓ కొత్త సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా మూడో వీకెండ్ వచ్చేసరికి వీక్ అయిపోతున్న రోజులువి. నెల రోజులు దాటితే అడ్రస్ ఉండట్లేదు ఏ సినిమా కూడా. ‘బాహుబలి’ లాంటటి మెగా మూవీ కూడా 50 రోజులు దాటాక థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. కానీ ‘రంగస్థలం’ మాత్రం 50వ రోజు కూడా మంచి వసూళ్లతో నడిచింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లలో ఆ సినిమాను నడిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఈ సినిమా ఇంకా ఆడుతోంది. కొన్ని సెంటర్లలో వంద రోజుల వేడుక కూడా పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమాతో భారీగా లాభాలందుకున్న బయ్యర్లు చాలా సంతోషంగా 100 డేస్ సెలబ్రేషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 సెంటర్లలో ఈ చిత్రం కోటి అంతకంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేయడం విశేషం.

‘బాహుబలి’కైనా ఈ ఘనత సొంతమైందా అన్నది సందేహమే. నాన్-బాహుబలి సినిమాల్లో మాత్రం ఇది రికార్డే. దీన్ని కొట్టే సినిమా ఇప్పుడిప్పుడే రాకపోవచ్చు. ‘రంగస్థలం’ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో అన్నిటికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్. ఈ థియేటర్ ఒక్కదాంట్లోనే 1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ‘రంగస్థలం’. ఈ చిత్రం గత వారాంతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో ఆడుతున్న కొత్త సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ‘ఈ నగరానికి ఏమైంది’ మాత్రమే దాని కంటే ఎక్కువగా గ్రాస్ కలెక్ట్ చేసింది. వంద రోజులకు చేరువ అవుతూ కూడా వీకెండ్‌లో రోజుకు రూ.50 వేల దాకా గ్రాస్ వసూలు చేయడమంటే మాటలు కాదు. దాని ముందు గత వారాల్లో విడుదలైన వేరే సినిమాలు దిగదుడుపే అని చెప్పాలి. సుదర్శన్ లో సైతం వంద రోజుల వేడుక భారీగానే ప్లాన్ చేశారు అభిమానులు.
Tags:    

Similar News