బంగార్రాజు వదిలిన 'అనుభవించు రాజా' ట్రైలర్..!

Update: 2021-11-17 05:37 GMT
రాజ్ తరుణ్ - కాశిష్ ఖాన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''అనుభవించు రాజా''. శ్రీను గవిరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చి నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన 'అనుభవించు రాజా' ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున.. ఈరోజు బుధవారం ఉదయం ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ విషయానికొస్తే.. 'రూపాయి పాపాయి లాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలిగానీ, ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టకూడదు' అనే డైలాగ్ తో ప్రారభమైంది.

రాజ్ తరుణ్ ను సెక్యూరిటీ జాబ్ చేసుకొనే యువకుడిగా పరిచయం చేసారు. కానీ అతని ఒరిజినల్ క్యారక్టర్ వేరే ఉంది. తన ఊర్లో అతను జూదాలు ఆడుకుంటూ సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేసే ఓ జల్సారాయుడు అని తెలుస్తోంది. 'బంగారం గాడి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తుంటది.. పోతుంటది. ఏదీ పర్మెనెంట్ గా ఆడదిక్కడ' అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో చెబుతుంది.

అయితే బంగారం సిటీకి వచ్చిన తర్వాత సెక్యురిటీ గార్డులంటే అలర్జీ అనే శ్రుతి అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి ఆ అమ్మాయిని ఎలా ప్రేమలో దించుతాడో అనేది సినిమాలో చూడాలి. ఈ కథ ఇటు పల్లెలోను అటు పట్నంలోనూ నడుస్తుంది. 'వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా.. బంగారంగా కాదు.. ప్రెసెడెంట్ బంగారంగా' అంటూ సినిమాలో రాజ్ తరుణ్ లక్ష్యం ఎంటనేది ట్రైలర్ చివర్లో చూపించారు. ఇందులో యాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు హింట్ ఇచ్చారు.

పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో వచ్చిన 'అనుభవించు రాజా' ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కు తగిన పాత్రలో ఆకట్టుకున్నాడు. మరి యువ హీరోకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. పోసాని కృష్ణమురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'అనుభవించు రాజా' చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందించగా.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేశారు. సుప్రియా బట్టేపాటి - రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు.



Full View



Tags:    

Similar News