దేవిశ్రీని కొట్టేస్తాడనుకుంటే.. ఇలా అయిపోయాడే

Update: 2016-07-12 22:30 GMT
అప్పుడెప్పుడో ‘జై’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు అనూప్ రూబెన్స్. తొలి సినిమాతోనే టాలెంట్ చూపించినా.. సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకోవడానికి చాలా టైమే పట్టింది. కెరీర్లో చాలా ఏళ్ల పాటు చిన్నా చితకా సినిమాలకే సంగీతాన్నందిస్తూ వచ్చాడు అనూప్. ఐతే గత రెండు మూడేళ్లలో మనోడి ఫేట్ మారింది. ‘ఇష్క్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనూప్.. ఆ తర్వాత మనం.. టెంపర్.. గోపాల గోపాల లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు దక్కించుకుని టాప్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. ‘మనం’ మ్యూజిక్ విని మెస్మరైజ్ అయిపోని సంగీతాభిమాని లేడు. అనూప్ కెరీర్లోనే కల్ట్ క్లాసిక్ లా నిలిచిపోయిందా సినిమా. ‘టెంపర్’తో మాస్ సినిమాలకు కూడా సరిపోతానని రుజువు చేసుకున్నాడు అనూప్. ‘గోపాల గోపాల’తోనూ ఆకట్టుకున్నాడు.

ఈ మూడు సినిమాల తర్వాత ఇక వరుసగా పెద్ద అవకాశాలు అందుకుంటాడని.. దేవిశ్రీని బీట్ చేస్తాడని అనుకుంటే అనూప్ అనుకున్న స్థాయిలో రైజ్ కాలేకపోయాడు. పెద్ద సినిమాలతో టాలెంట్ చూపించినా.. అతడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు లేవు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్న కొంచెం పెద్ద సినిమా అంటే ‘ఇజం’ మాత్రమే. ఇది కాకుండా ‘ఆటాడుకుందాం రా’ లాంటి చిన్న సినిమాలు ఒకటీ అరా చేస్తున్నాడు. స్టార్ హీరోల్లో ఎవరితోనూ పని చేయట్లేదు అనూప్. నిజానికి అంతా అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ సినిమాకు ఈపాటికి పని చేస్తుండేవాడు అనూప్. కానీ ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డాలీ దర్శకత్వంలో అయినా ఆ సినిమా మొదలవుతుందేమో.. ఆ సినిమా తర్వాతైనా అనూప్ ఊపందుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News