మ‌రీ.. వివ‌ర‌ణ అంతా ఏంది అనుష్క‌?

Update: 2018-08-14 05:52 GMT
ప్ర‌ముఖుల‌కు పొగ‌డ్త‌లు ఎంత కామ‌నో.. తెగ‌డ్త‌లు కూడా అంతే కామ‌న్‌. కానీ.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖులుగా కీర్తించే చాలామందిలో ఒక విచిత్ర‌మైన గుణం క‌నిపిస్తుంటుంది. త‌మ‌ను నెత్తిన పెట్టుకొని చూసుకున్న‌న్ని రోజులు ఏమీ అన‌రు. కానీ.. ఒక్క విమ‌ర్శ‌ను కూడా భ‌రించ‌లేని ప‌రిస్థితి వారిలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

కోట్లాది మంది అభిమానాన్ని పొందిన వారికి కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. ఆ రియాలిటీని గుర్తించే విష‌యంలో ప్ర‌ముఖులు త‌ర‌చూ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి.. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి అనుష్క శ‌ర్మ మాట‌లుగా చెప్పాలి.

తాజాగా జ‌రిగి లార్డ్స్ టెస్టుకు ముందు లండ‌న్ లోని భార‌త హైక‌మిష‌న్ కార్యాల‌యంలో ఇచ్చిన విందుకు టీమిండియాతో పాటు కెప్టెన్ కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ పాల్గొన‌టం వివాదంగా మారిన సంగ‌తి తెలిసిందే. విందుకు అనుష్క హాజ‌రు కావ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనిపై.. బీసీసీఐ.. భార‌త హైక‌మిష‌న్ ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇవ్వ‌టం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల వ‌ర్షం ఆగ‌లేదు.

త‌మ‌నెప్పుడూ పొగ‌డాలి.. ఆకాశానికి ఎత్తేయాలే కానీ.. ఇలా వేలెత్తి చూపించ‌టాన్ని అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని అనుష్క శ‌ర్మ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చేసింది. విందు కార్య‌క్ర‌మం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే జ‌రిగింద‌ని.. అందులో తాను ఎందుకు పాల్గొన్నాన‌న్న విష‌యాన్ని చెబుతూ.. రూల్స్ ప్ర‌కార‌మే విందు కార్య‌క్ర‌మం జ‌రిగింద‌న్నారు.ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై అధికారులు వివ‌ర‌ణ ఇచ్చార‌ని.. అయిన‌ప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నార‌ని మండిప‌డ్డారు.

త‌న‌పై సాగుతున్న విమ‌ర్శ‌లన్నీ కూడా ఒక ప‌థ‌కం ప్ర‌కార‌మే సాగుతున్నాయే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌ని తేల్చేసిన అనుష్క‌.. ఇక‌పై తాను స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఈ మాత్రం స్పందించాల్సిన అవ‌స‌రం ఏముచ్చిందంటావ్ అనుష్క‌?  ప‌ది మంది ప‌ది ర‌కాలుగా అనుకుంటారు. అలాంటివి  తీసుకోవ‌టానికి సిద్ధంగా లేకుంటే మౌనంగా ఉండిపోతే స‌రిపోతుంది. కానీ.. వాటిని ప్ర‌శ్నించటంతో క‌లిగే అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏంటి?
Tags:    

Similar News