నాని వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన 'బాహుబలి' నిర్మాత..!

Update: 2021-12-23 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం రోజురోజుకు వివాదంగా మారుతోంది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల జీవో నెం.35 పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. గురువారం హీరో నాని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని.. సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రభుత్వ నిర్ణయం సరైనద కాదని.. ప్రేక్షకుల్ని అవమానించేలా ఉందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని అన్నారు.

నాని వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోంది. 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా నాని తో తాను ఏకీభవిస్తున్నానని ప్రకటించారు. ''నేను నానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏపీలో టిక్కెట్ ధరల సమస్య తెలుగు చిత్ర పరిశ్రమకు దీర్ఘకాలిక ప్రభావాలతో డిస్టిబ్యూటర్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇదిలా ఉంటే చాలా థియేటర్ల మనుగడ కష్టం. ఈ పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఈ సమస్య అతి త్వరలో పరిష్కరించబడుతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను'' అని శోభు ట్వీట్ చేశారు.

అంతేకాదు శోభు యార్లగడ్డ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. ''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినిమాల నుండి పన్ను వసూళ్లు పెంచాలనుకుంటే ఈ విధంగా చేయాలి.
1. అన్ని థియేటర్లలో టిక్కెట్ల విక్రయాలను 100% కంప్యూటరీకరణ తప్పనిసరి చేయండి.
2. టిక్కెట్ సేల్స్ లో ఆటోమేటిక్ & రియల్ టైం అప్డేటింగ్
3. సినిమా టిక్కెట్ల ఫ్రీ & వేరియబుల్ ధర (ఫ్రీ మార్కెట్ సరైన ధరను నిర్ణయిస్తుంది)
అలాంటివి పాటిస్తే ఎగ్జిబిషన్ రంగానికి, చిత్ర పరిశ్రమకు మరియు ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే విజయవంతమైన పరిస్థితి ఏర్పడుతుంది'' అని బాహుబలి నిర్మాత తెలిపారు.

''నిత్యావసర వస్తువు అయితే తప్ప గరిష్ఠ చిల్లర ధర (MRP) ప్రభుత్వం నిర్ణయించదు.. ప్యాకేజ్ చేయబడిన వస్తువుల ఉత్పత్తిదారులు/తయారీదారులు మాత్రమే నిర్ణయిస్తారు'' అని శోభు యార్లగడ్డ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక హీరో సందీప్ కిషన్ కూడా పరోక్షంగా నాని కి మద్దతు పలికారు.

''మీరు మౌనంగా ఉండడాన్ని ఎంచుకుంటే ఫర్వాలేదు.. ప్రతి ఒక్కరికి వారి వారి కారణాలు ఉంటాయి. కానీ కనీసం తెలుసుకోవడం చాలా చాలా చాలా ముఖ్యం.. తప్పు ఒప్పుల గురించి తెలుసుకోవాలి.. మన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి.. భవిష్యత్తు గురించి బాగా తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము'' అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇందులో ఎవరినీ ప్రస్తావించకపోయినా.. ప్రకటన నెలకొన్న టికెట్ రేట్ల అంశంపైనే స్పందించారని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే 'ప్రస్థానం' దర్శకుడు దేవకట్టా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై స్పందిస్తూ.. ''సినిమా టిక్కెట్లను మరచిపోండి. స్వీయ-దిద్దుబాటు, డిమాండ్ ఆధారిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ప్రైవేట్ "ఉత్పత్తి" పై ప్రభుత్వం రేట్లను నిర్ణయించడం పూర్తిగా అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం & నియంతృత్వం. మనలో "మెజారిటీ" ప్రజలు ఈ ప్రాథమిక వాస్తవాన్ని కూడా అర్థం చేసుకోలేరు కాబట్టి.. కలిసి ఈ "శిధిలాన్ని" ఆనందిద్దాం'' అని ఘాటుగా ట్వీట్ చేశారు.
Tags:    

Similar News