రెహమాన్ కు అమ్మ ఇచ్చిన బ‌హుమానం!

Update: 2016-09-08 08:21 GMT
ఆత్మీయులు ఇచ్చే బ‌హుమానాలు ఎంతో ప్ర‌త్యేకంగా దాచుకుంటాం! సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా వాటిని భ‌ద్రంగా దాచుకుంటాం. వాటి మీద ధూళీ కూడా ప‌డ‌నివ్వ‌యం. ఇక‌, తొలిసారిగా అందుకున్న బ‌హుమానాలు అయితే మ‌రీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటాం. అయితే, ఎవ‌రు ఎన్నిర‌కాల బ‌హుమ‌తులు ఇచ్చినా కూడా క‌న్నత‌ల్లి ఇచ్చే బ‌హుమానం ఎవరికైనా మ‌రింత ప్ర‌త్యేకం క‌దండీ! త‌న త‌ల్లి ఇచ్చిన తొలి బ‌హుమ‌తికి సంబంధించిన కొన్ని జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.ర‌హ‌మాన్‌.

త‌న త‌ల్లి క‌రీమా బేగం అంటే రెహ‌మన్ కి ఎంతో ఇష్టం. 1986లో ఆమె రెహ‌మాన్ కు ఒక గిఫ్ట్ కొనిచ్చారు. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే... ఒక అంబాసిడ‌ర్ కారు. ఆ కారును ఎంతో భ‌ద్రంగా ర‌హ‌మాన్ దాచుకుంటూ వ‌స్తున్నారు. అలాగ‌ని దాన్ని ఏ గ్యారేజీలోనే పెట్టేసి వ‌దిలేయ‌లేదు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఉంచారు. ఎప్ప‌టిక‌ప్పుడు రిపేర్లు చేయిస్తూ... ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తే బాగుచేయిస్తూ మాంచి కండిష‌న్లోనే ఉండేట్టు చూసుకుంటున్నారట‌. ప్ర‌తీరోజూ ఇంట్లోంచి బ‌య‌ట‌కి వెళ్ల‌ట‌ప్పుడు ఆ కారు వైపు అలా చూసి వెళ్తుండ‌టం ఓ గొప్ప అనుభూతి అని ర‌హ‌మాన్ చెప్పారు. ఎంతో ప్రేమ‌గా అమ్మ ఇచ్చిన బ‌హుమానం గురించిన సంగ‌తుల‌న్నీ త‌న ఫేస్ బుక్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు ర‌హ‌మాన్. ఆ అంబాసిడ‌ర్ కారు ఫొటోను కూడా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ఎంతైనా, త‌ల్లి ఇచ్చిన తొలి బ‌హుమానం అంటే దాంతో ఉండే అనుబంధం వేరు క‌దండీ. ఈ సృష్టిలో అమ్మ ప్రేమే ఒక అద్భుతం. అలాంటిది అమ్మ ఇచ్చిన తొలి బ‌హుమానం మ‌రింత మ‌ధురం క‌దండీ!
Tags:    

Similar News