అరవింద సమేత కలెక్షన్లు డ్రాప్

Update: 2018-10-15 14:11 GMT
ఒక పెద్ద కాంబినేషన్లో తెరకెక్కి భారీ అంచనాలతో వచ్చే సినిమా ఫలితం ఏంటన్నది తొలి వీకెండ్లో చెప్పడం కష్టం. వారాంతానికి ముందే బుకింగ్స్ జరుగుతాయి కాబట్టి టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీగానే వస్తుంటాయి. సినిమా అసలు ఫలితం ఏంటన్నది సోమవారానికి కానీ తెలియదు. గత గురువారం భారీ అంచనాల మధ్య రిలీజైన ‘అరవింద సమేత’కు కూడా తొలి రోజు.. తొలి వారాంతంలో భారీగానే వసూళ్లు వచ్చాయి. ఐతే టాక్ కొంచెం డివైడ్ గా ఉండటంతో సోమవారం నాడు వసూళ్లు ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సోమవారం రానే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లలో మేజర్ డ్రాప్ ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వసూళ్ల వివరాలు చూస్తే.. ఆక్యుపెన్సీ సగం కూడా లేదు. చాలా చోట్ల 25 శాతానికి వసూళ్లు పడిపోయాయి.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విషయానికి వస్తే.. ఇక్కడ నిన్నటి వరకు ‘అరవింద సమేత’ను నాలుగు థియేటర్లలో ఆడిస్తూ వచ్చారు. వారాంతంలో కూడా ఈ నాలుగు థియేటర్లలో ఒక్క సుదర్శన్ థియేటర్లో మాత్రమే ఫుల్స్ అయ్యాయి. మిగతా మూడు థియేటర్లలో ఆక్యుపెన్సీ సగటున 70 నుంచి 90 శాతం మధ్య నడిచింది. ఐతే సోమవారం ఒక థియేటర్ నుంచి ‘అరవింద సమేత’ను తీసేశారు. మిగతా మూడు థియేటర్లలో మార్నింగ్ షోకి చాలా తక్కువ గ్రాస్ వచ్చింది. ఫుల్ అయితే రూ.1.25 లక్షల గ్రాస్ వచ్చే మెయిన్ థియేటర్ సుదర్శన్‌లో ఉదయం ఆటకి రూ.33,198 గ్రాస్ మాత్రమే వచ్చింది. సంధ్య థియేటర్లో రూ.26,788, తారకరామ థియేటర్లో రూ.8,959 మాత్రమే గ్రాస్ వసూలైంది. వసూళ్లు ఏ స్థాయిలో డ్రాప్ అయ్యాయో చెప్పడానికి ఇది ఇండికేషనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కలెక్షన్ల లెక్కలు కూడా ఇదే తరహాలో ఉంటున్నాయి. ఐతే దసరా సెలవుల సీజన్ కాబట్టి మళ్లీ సినిమా పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం మరి ఏమవుతుందో?
Tags:    

Similar News