అర్జున్ ఆ రెండు బ్లాక్ బస్టర్లూ వద్దన్నాడట!

Update: 2018-08-09 01:30 GMT
యాక్షన్ హీరో అర్జున్ కెరీర్లో గొప్ప మలుపు ‘జెంటిల్‌మన్’. అప్పటికే అర్జున్ హిట్లు కొట్టి ఉన్నాడు కానీ.. ఈ స్థాయి బ్లాక్ బస్టర్ మాత్రం లేదు. దక్షిణాది మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది. దీని తర్వాత ‘ఒకే ఒక్కడు’ సైతం అర్జున్ కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ రెండు చిత్రాలకూ దర్శకుడు శంకరే అన్న సంగతి తెలిసిందే. ఐతే అర్జున్ ముందు ఈ రెండు కథల్నీ తిరస్కరించాడట. అసలు ‘జెంటిల్ మన్’ కథ అయితే వినడానికి కూడా ఒప్పుకోలేదట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా అర్జునే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ‘జెంటిల్ మన్’ సినిమాకు కొన్నేళ్ల ముందు తాను వరుస ఫ్లాపుల్లో ఉన్నానని.. అప్పుడు తనను పట్టించుకోని వాళ్లంతా.. తాను మళ్లీ విజయాలందుకున్నాక చుట్టూ మూగారని అర్జున్ అన్నాడు.

అలాంటి టైంలోనే శంకర్ తనకు కథ వినిపించడానికి ప్రయత్నించగా.. తాను అతడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. సినిమా చేయనని చెప్పేశానని అర్జున్ తెలిపాడు. ఐతే కథ అయినా వినకుండా నో చెప్పడమేంటని శంకర్ చాలా ఆవేదనగా మాట్లాడటంతో అతడికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు అర్జున్ తెలిపాడు. ‘జెంటిల్ మన్’ కథ బాగా నచ్చడంతో ఆ సినిమా చేసినట్లు వెల్లడించాడు. ఇక శంకర్ తో చేసిన రెండో సినిమా ‘ఒకే ఒక్కడు’ కథ తనకు సూటవ్వదేమో.. రాజకీయాలకు దూరంగా ఉన్న తాను ముఖ్యమంత్రి పాత్ర చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించి ఆ కథ వద్దనుకున్నట్లు అర్జున్ తెలిపాడు. ఐతే శంకర్ తనను ఒప్పించి ఆ సినిమా చేశాడని.. అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని అర్జున్ అన్నాడు. తాను శంకర్ చేసిన సినిమాల్లో తాను చేయాలని కోరుకున్నది మాత్రం ‘భారతీయుడు’ అని అతను వెల్లడించాడు.
Tags:    

Similar News