సన్నాఫ్ షారుక్ ఖాన్.. ఖైదీ నెం.956

Update: 2021-10-15 11:42 GMT
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి రోజున అర్థరాత్రి ముంబైలోని క్రూయిజ్ ఓడరేవు డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు జరపగా.. ఆర్యన్ తో పాటు మరో 8మంది పట్టుబడ్డారు. ప్రస్తుతం ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ జరుగుతోంది. డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్.. గత 10 రోజులుగా ఆర్థర్ రోడ్ జైలులోనే ఉన్నాడు.

అయితే ఆర్యన్ ఖాన్ కు జైలు అధికారులు నెం. 956 ను కేటాయించినట్లు తెలుస్తోంది. అలానే అతని కుటుంబం నుంచి రూ. 4500 మనీ ఆర్డర్ వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం జైల్లో గరిష్టంగా అంత మొత్తాన్నే ఇవ్వడానికి అనుమతి ఉంది. వీటిని ఆర్యన్ తన క్యాంటీన్ ఖర్చుల కోసం వాడుకోనున్నాడు. ఇతర ఖైదీలతో పాటు, నిర్బంధ బ్యారక్‌ లో ఉన్న ఆర్యన్ ను గురువారం సాధారణ సెల్‌ కు బదిలీ చేశారు. కోవిడ్ -19 పరీక్షలో నెగటివ్ గా తేలింది.

ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్ నిరాకరించగా.. మూడోసారి రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. సెషన్స్ కోర్టు తీర్పును అక్టోబర్ 20వ తేదీ వరకు రిజర్వ్ లో పెట్టారు. దీంతో ఆర్యన్ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్ రోడ్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ముంబై సెషన్స్ కోర్టులో ఆర్యన్ బెయిల్ పై వాడివేడి వాదనలు జరిగాయి.

నిషేధిత పదార్థాల పంపిణీలో పాలుపంచుకున్న ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించాలని ఎన్సీబీ తరపు న్యాయవాది కోరారు. ఈ ఆరోపణలను ఆర్యన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ కొట్టిపారేశారు. అతను చట్టవిరుద్ధమైన పదార్థాల క్రయవిక్రయాలలో పాలుపంచుకోలేదని కోర్టుకు తెలిపారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడా లేదని వాదించాడు.

ఇకపోతే ముంబై కోర్టు ఆర్యన్ కు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ప్రతి వ్యక్తి, వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉండగా.. ఆర్యన్ కు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ లతో ఆర్యన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను చూసి ఆర్యన్ కన్నీటి పర్యంతరమయ్యాడని కథనాలు వస్తున్నాయి.

అయితే అక్టోబర్ 7న జ్యుడీషియల్ కస్టడీకి పంపబడినప్పటి నుండి ఆర్యన్ ఖాన్ అన్నం తినకుండా.. కేవలం పార్లే జి బిస్కెట్లు మాత్రమే తింటున్నాడని చెబుతున్నారు. అంతేకాదు జైలులో మొదటి రోజు నుండి స్నానం కూడా చేయలేదని జాతీయ మీడియా వెల్లడించింది. ఆర్యన్ కు బెయిల్ వస్తుందా లేదా మరోసారి పిటిషన్ పెట్టుకోవాల్సిన వస్తుందా అనేది ఈ నెల 20న తేలిపోతుంది.


Tags:    

Similar News