దేశం గర్వించదగ్గ గాయకుల్లో ఆశాభోంస్లే పేరు తప్పకుండా ఉంటుంది. ఆరు దశాబ్డాలుగా ఎన్నో మధురమైన గీతాలు ఆలపించిన ఆమె స్వరం కళాభిమానులందరికీ పరిచయమే. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఒరవడిని అందిపుచ్చుకుంటూ ఆమె ఇప్పటికీ పాటలు పాడుతూనే ఉన్నారు. శ్రోతలను పరవశింపజేస్తూనే ఉన్నారు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్యే పురస్కారం 2000లోనే వరించింది. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ 2008లో అందుకున్నారు.
తాజాగా ఆశాభోంస్లే బొమ్మను ప్రతిష్ఠాత్మకమైన మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. న్యూ ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో ఆశాభోంస్లే మైనపు విగ్రహం ఏర్పాటు చేస్తారు. మ్యూజియం ప్రతినిధులు ఆమె రూపురేఖల కొలతలు గత ఏడాదిలోనే సేకరించారు. త్వరలోనే మ్యూజియంలో ఆశా విగ్రహం కొలువు దీరనుంది. తరతరాలకు చెరిగిపోని విధంగా తన స్వరాన్ని పాటల ద్వారా మనకందించిన ఆశాభోంస్లే రూపురేఖలు ఎప్పటికీ మన కళ్లముందే అలానే నిలిచిపోనున్నాయి.
ఆశాభోంస్లే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ పాటలు పాడినప్పటికీ తెలుగులోనూ కొన్ని పాటలు పాడారు. 1980-90 మధ్య సినిమాల్లో ఆమె పాటలు కొన్ని వినిపిస్తాయి. ఈతరం సినిమాల్లో కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ సినిమాలో ‘నాలో ఊహలకు.. నాలో ఆశలకు’ పాటకు తన సుమధుర స్వరంతో జీవం పోశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/