అవసరాల అలాంటి సినిమా చేస్తున్నాడా?

Update: 2016-05-08 17:30 GMT
కొందరు నటుల్ని చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్లోనే తెగ నచ్చేస్తారు. మంచి నటుడు అన్న ఫీలింగ్ కలిగిస్తారు. ‘అష్టాచెమ్మా’లో అవసరాల శ్రీనివాస్ ను చూస్తే జనాలకు అలాంటి ఫీలింగే కలిగింది. చక్కటి వాచకం.. మంచి టైమింగ్ తో తొలి సినిమాతోనే భలే నవ్వించాడు అవసరాల. ఆ సినిమా అతడి మంచి మంచి అవకాశాల్ని తెచ్చిపెట్టింది. రెండేళ్ల కిందట దర్శకుడిగా కూడా మారి ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి మంచి సినిమాను అందించిన అవసరాల.. మెగా ఫోన్ పట్టాక కూడా నటనను పక్కనబెట్టేలేదు. కంచె.. నాన్నకు ప్రేమతో.. లాంటి సినిమాల్లో మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.

ప్రస్తుతం దర్శకుడిగా రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’కు సన్నాహాలు చేసుకుంటూనే నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న అవసరాల.. తొలిసారి సోలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. అది ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ కావడం విశేషం. గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన ‘హంటర్’ను అవసరాల హీరోగా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఐతే హంటర్ అడల్ట్ కామెడీ మూవీ. అందులో అడల్ట్ కంటెంట్ శ్రుతి మించి ఉంటుంది. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కాబట్టి.. మల్టీప్లెక్సుల్లో ఆ సినిమా బాగానే ఆడేసింది.

అక్కడి ప్రేక్షకుల టేస్టు కూడా వేరు. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఏమాత్రం జీర్ణించుకుంటారో చూడాలి. ఈ మధ్య ‘గుంటూరు టాకీస్’ అడల్ట్ కంటెంట్ ఎక్కువవడంపై చాలా వివాదాలు నడిచాయి. ఐతే ‘హంటర్’లో డోసు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పటిదాకా సాత్వికమైన పాత్రలు చేసిన అవసరాల ఈ పాత్రలో ఎలా కనిపిస్తాడో.. ఈ సినిమాను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News