‘బాహుబలి’ దెబ్బకు ‘కంచె’ విలవిల

Update: 2016-03-29 07:12 GMT
చందమామ కథలు చిన్న సినిమానే. నిర్మాత.. దర్శకుడు.. నటీనటులు అందరూ కూడా పెద్దగా పేరు లేని వాళ్లే. కానీ ఈ సినిమా గత ఏడాది జాతీయ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైతే తెలుగు మీడియాలో మంచి ప్రచారం దక్కింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రవీణ్ సత్తారు గురించి అందరికీ తెలిసింది. ఆ లెక్కన చూస్తే క్రిష్ లాంటి పేరున్న దర్శకుడు తీసిన ‘కంచె’ లాంటి గొప్ప సినిమా గురించి ఈపాటికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండాలి. క్రిష్ ను అందరూ ఆకాశానికెత్తేస్తుండాలి. ‘కంచె’ మన తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ ప్రశంసలు కురిపిస్తుండాలి. కానీ అవేమీ లేవిప్పుడు. కారణం.. బాహుబలి.

‘బాహుబలి’ ఏకంగా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికయ్యాక ఉత్తమ ప్రాంతీయ చిత్రం గురించి పట్టేదెవ్వరికి? అందరూ ‘బాహుబలి’ని చూసి గర్విస్తున్నారు. దాని మీదే ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యలో మొక్కుబడిగా కొందరు ‘కంచె’ను ప్రస్తావిస్తున్నారు. నిజానికి ‘బాహుబలి’ని చూసి మనం ఎంత గర్విస్తామో.. అలాగే ‘కంచె’ను చూసి కూడా అంతే గర్వించాలి. కంటెంట్ పరంగా చూస్తే కంచె.. ‘బాహుబలి’ని మించిన సినిమా. కంచె విడుదలైన సమయంలో సైతం మనం ‘బాహుబలి’ మత్తులోనే ఉండిపోయాం. ఆ సినిమాకు ఇవ్వాల్సినంత విజయాన్ని.. గుర్తింపును ఇవ్వలేకపోయాం. ఇప్పుడు జాతీయ అవార్డుల విషయంలోనూ ‘కంచె’.. బాహుబలి కారణంగా దెబ్బ తింది. బాహుబలి లేకపోయి ఉంటే ‘కంచె’ ఇంకా గొప్ప పురస్కారమే పొంది ఉండేదేమో. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన ‘కంచె’ది కేవలం ‘ప్రాంతీయ చిత్రం’ పురస్కారానికి పరిమితమయ్యే స్థాయి కాదు. ఒకవేళ ఆ పురస్కారమే దక్కి ఉన్నా.. ‘బాహుబలి’ లేకపోయి ఉంటే దాన్ని చూసి మనందరం గర్వించేవాళ్లం. ఆ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. మొత్తానికి ‘కంచె’ది అన్ని రకాలుగా రాంగ్ టైమింగే.
Tags:    

Similar News