ఆ రెండు ఏరియాల్లో బాహుబలి బంగారు గని

Update: 2015-07-18 11:39 GMT
బాహుబలి మీద ప్రతి డిస్ట్రిబ్యూటరూ రికార్డు స్థాయి ధర పెట్టాడు. ఐతే ఆ సినిమా సాధిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే దీని మీద పెట్టుబడి పెట్టిన ఏ ఒక్కరూ నష్టపోయే పరిస్థితి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో.. ఓవర్సీస్‌ లో.. ఇలా ప్రతి చోటా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన బాహుబలి.. దానికి తగ్గట్లే వసూళ్ల మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ డిస్ట్రిబ్యూర్లు ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు వచ్చేశారు. ఇక రాబోయేదంతా లాభమే. ఐతే తెలుగు వెర్షన్ వరకు కర్ణాటక, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ రన్‌ లో అందుకోబోతున్న లాభాల లెక్క తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి.

బాహుబలి ముందు వరకు ఏ తెలుగు సినిమాకు కూడా కర్ణాటక రైట్స్ రూ.5 కోట్లకు దాటలేదు. దీంతో దాదాపు రెట్టింపు రేటు పెట్టి రూ.9 కోట్లకు కర్ణాటక రైట్స్ అమ్మారు. ఆ రైట్స్‌ ను మారు బేరానికి రూ.13 కోట్లకు అమ్మినట్లు వార్తలొచ్చాయి. ఐతే కర్ణాటక తొలి వారం గ్రాస్ వసూళ్లు రూ.30 కోట్లు దాటిపోయాయి. షేర్ మాత్రమే 20 కోట్లకు పైగా వచ్చింది. అంటే అమ్మిన ధరకు ఇప్పటికే రెట్టింపు కంటే ఎక్కువ వసూలైంది. ఫుల్ రన్‌లో షేర్ రూ.30 కోట్ల మార్కు అందుకోవడం ఖాయం. దీన్ని బట్టి అక్కడ లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్ రైట్స్ విషయానికి వస్తే రూ.10 కోట్లకు అమ్మారు. అది రికార్డు ధరే. కానీ ఇప్పటికే అక్కడ గ్రాస్ వసూళ్లు రూ.35 కోట్లకు చేరుకున్నాయి. ఫుల్ రన్‌ లో రూ.40 కోట్లకు పైనే వస్తాయి. షేర్ పాతిక కోట్లను దాటబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాలు అందుకుంటున్నారు కానీ.. కర్ణాటక, యుఎస్ ఏరియాలకు రైట్స్ కొన్నవాళ్లదే అదృష్టమంటే.
Tags:    

Similar News