బాహుబలి నిర్మాతల సేఫ్ గేమ్ ?

Update: 2018-09-02 15:30 GMT
ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ అందుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆలస్యం అందరి కళ్ళు సదరు దర్శక నిర్మాతల మీద ఉండటం సహజం. అందుకే అప్పట్లో జెంటిల్ మెన్ లాంటి సినిమాలు తీసిన కుంజుమోన్ గారు ఆ అంచనాలు అందుకోవడం కోసం ప్రతి సినిమా బడ్జెట్ ను అంతకంతా పెంచుకుంటూ పోయేవారు. ఏఎం  రత్నం సైతం అంతే. ప్రేమ కథలకు సైతం కోట్లు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరూ తాత్కాలికంగా ఆర్థిక భారాన్ని మోయలేక పక్కకు తప్పుకోవడం వేరే విషయం. ఇది తెలిసే కాబోలు బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా అధినేతలు కొత్త సినిమా విషయంలో తొందపడకుండా తెరవెనుక బిజినెస్ మాత్రం జరుపుకుంటూనే ఉన్నారని టాక్. విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్న సినిమాలకు వీరు ఆర్థిక సహాయం అందిస్తున్నారట. అంటే ఫైనాన్స్ చేయటం లాగా అన్నమాట. సినిమా ఆడినా ఆడకపోయినా వీరి మొత్తం వీరికి అందుతుంది కాబట్టి వెనుక నుంచి అభయ హస్తం ఇస్తున్నట్టుగా ఇండస్ట్రీ టాక్.

కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాలతో పాటు శరత్ మరార్ ఇటీవలే పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన ప్రేమకు రైన్ చెక్ వెనుక ఉన్నదీ వీళ్ళే అని వినికిడి. అంతే కాదు వారాహి సంస్థ సహాయంతో ఆ బ్రాండ్ ని ఉపయోగించి సీడెడ్ కు సంబంధించిన వేరే సినిమాల  డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా కొంటున్నట్టు సమాచారం. ఇవి నిజమని నిర్ధారించే ఆధారాలు లేనప్పటికీ ఇదేదో రిస్క్ లేని వ్యాపారంలాగా బాగుందే అనే చర్చలు నిర్మాతల సర్కిల్స్ లో జరుగుతున్నాయి. దేవా కట్టా ప్రవీణ్ సత్తారు జంట దర్శకత్వంలో నెట్ ఫ్లిక్స్ కోసం శివగామి వెబ్ సిరీస్ తీయబోతున్నారు అనే వార్త వచ్చింది కానీ దానికి సంబందించిన అప్ డేట్స్  ఇంకా బయటికి రాలేదు. వందల కోట్ల లాభాలు తెచ్చిన బాహుబలి  నిర్మాతలు ఈ విధంగా కొత్త రకమైన ఎత్తుగడకు పోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Tags:    

Similar News