బాహుబలి@సివిల్ ఇంజనీరింగ్ పేపర్

Update: 2015-10-09 04:21 GMT
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ప్రతిష్ట కలిగించిన బాహబలి పరీక్షల్లో ప్రశ్నగా నిలిచిన వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదీ కూడా సివిల్ ఇంజనీరింగ్ పరీక్షల్లో ప్రశ్న కావటం మరీ విశేషం. విషయానికి వస్తే తమిళనాడులోని వెల్లూరు వీఐటీ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఈ అరుదైన ఘటనకు నాంది పలికింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన ఈ అత్యద్భుతమైన ఫాంటసీ మూవీ ఆధారంగా విద్యార్థుల మెదడుకు మేత పెట్టారు.

బాహుబలి సినిమాలో క్లైమాక్స్‌ లో వచ్చే యుద్ధ సన్నివేశంలోని సెట్ పీస్ డిజైనింగ్‌పై ప్రశ్నను తమ ప్రశ్నాపత్రంలో చూడటంతో విద్యార్థులు ఆశ్చర్యపడ్డారు. ఆగస్టు నెలలోనే ఈ ఘటన జరిగింది. ఈ పేపర్ రూపొందించిన వీఐటీ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లెర్నింగ్ ప్రక్రియను విద్యార్థులు ఆస్వాదించడంలో తోడ్పడుతుందనే

ఆలోచనతో ఈ ప్రశ్నను రూపొందించినట్లు తెలిపారు. ఆయన అడిగిన ప్రశ్నకు 20 మార్కులు. ఈ ప్రశ్నలో నటుల భద్రతకు హామీ ఇస్తూ,  ఆప్టిమమ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ (అత్యంత గరిష్ట నిర్మాణ సుస్ధిరత)ని డిజైన్ చేయాలని విద్యార్థులను కోరారు.

తన ప్రశ్నలు చాలావరకు విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేవిధంగా అప్లికేషన్ ఆధారితంగా ఉంటాయని ఆ ప్రొఫెసర్ వివరించారు. మొత్తం మీద మన బాహుబలి ఇంజనీరింగ్ పరీక్షల్లో కూడా తన హవా సృష్టించిందన్నమాట.
Tags:    

Similar News