‘సవ్యసాచి’ టైటిల్లో ఏంటా మిస్టరీ?

Update: 2017-08-17 15:38 GMT
‘ప్రేమమ్’ తర్వాత అక్కినేని నాగచైతన్య-చందూ మొండేటి కాంబినేషన్లో రాబోతున్న ‘సవ్యసాచి’ సినిమా టైటిల్ లోగో బుధవారం లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ తో పాటు ఆ టైటిల్ లోగోను డిజైన్ చేసిన తీరు కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఇన్ స్టంట్ గా క్రేజ్ వచ్చేసింది. ‘సవ్యసాచి’ అనే టైటిల్ పెట్టారు.. ఇది ఏ తరహా సినిమా అయి ఉండొచ్చు అన్న చర్చ నడుస్తోంది ప్రేక్షకుల్లో.

చందూ మొండేటి తొలి సినిమా ‘కార్తికేయ’తోనే డిఫరెంట్  డైరెక్టర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే అనుకోకుండా రెండో సినిమాగా ‘ప్రేమమ్’ రీమేక్ చేయాల్సి వచ్చింది. రీమేక్ కదా అని మొక్కుబడిగా చేయకుండా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి ఆ సినిమాను హిట్ చేసిన చందూ.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. చందూకు బేసిగ్గా సైంటిఫిక్ థ్రిల్లర్లంటే ఇష్టం. ఆ తరహా సినిమాలే ఎక్కువ చేయాలని ఉన్నట్లు కూడా ఇంతకుముందే చెప్పాడు. ‘కార్తికేయ’లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ డిస్కస్ చేశాడతను.

చైతూతో చేయబోయే ‘సవ్యసాచి’ కూడా అలాంటి డిఫరెంట్ అటెంప్టే అంటున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోలో చాలామంది గమనించని విషయం ఒకటుంది. ‘సవ్యసాచి’లోని ‘సా’ అనే అక్షరం మీద ఒక చేతి ముద్రను అందరూ గమనించే ఉంటారు. కానీ ఆ చేతి ముద్ర లోపల కూడా ఒక చిన్న చిత్రం ఉంది. తల్లికడుపులో ఉండే పసిబిడ్డ చిత్రమది. దీనికి కథలో ప్రాధాన్యం ఉందని.. బహుశా ఒక బిడ్డ చుట్టూ ఈ కథ సాగొచ్చని భావిస్తున్నారు. తనకు ఇష్టమైన సైంటిఫిక్ థ్రిల్లర్‌ గా ఈ సినిమాను మలుస్తున్నాడేమో చందూ అని కూడా చర్చించుకుంటున్నారు. కథ ఎలా ఉన్నప్పటికీ టైటిల్‌ తోనే జనాల్లో క్యూరియాసిటీ తీసుకురావడంలో చందూ విజయవంతమయ్యాడు.
Tags:    

Similar News